Wednesday, January 22, 2025

రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను మరోసారి ప్రయోగించి దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను బిజెపి టార్గెట్ చేసింది. వారిపై ఇన్‌కమ్ టాక్స్ (ఐటి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు చేసింది. ఒకేసారి వందల మంది అధికారుల మోహరింపుతో సోదాలు నిర్వహించి, విపక్షనాయకుల గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించటమే బిజెపి ఎత్తుగడ. విపక్షాలను బెదిరించేటందుకు ఇడి, ఐటి, సిబిఐలను అస్త్రాలుగా ఉపయోగించుకొంటుంది. ప్రతిసారీ ఏదో ఒక సాకులు, ఆరోపణలు తెరపైకి తేవటం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇళ్ళలో ఇడీ సోదాలు జరపటం బిజెపి ట్రేడ్ మార్కుగా మారింది. ఈ సోదాలు రోజుల తరబడి కొనసాగిస్తూ విపక్షాలను విచారణ పేరుతో 8 10, 11 గంటలు ఏకబిగినా ప్రశ్నల పరంపరతో వేధించడమే ఈ సంస్థలు పనిగా పెట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు ఇటీవల పరిణామాలు చూస్తేనే స్పష్టమవుతుంది. ఈ మధ్య ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర పర్యటనకు వెడితే, ఆ రాష్ట్రంలో ఈ సంస్థలు వాలిపోతున్నాయి. ఉదాహరణకు తమిళనాడులో ఇటీవల అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన రెండు రోజులకే ఇడి ఆ రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ (47)ని లక్ష్యంగా చేసుకుంది. ఆయన ఇల్లు, సన్నిహితులు ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక, సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది. అమిత్ షా ప్రోద్బలంతోనే ఈ ఇడిల దాడులు జరుగుతున్నాయని అధికార డిఎంకె నేతలు ఆరోపించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 14న అమిత్ షా పర్యటించారు. అదే రోజు సిబిఐ కూడా రంగంలోకి దిగింది.

ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జిబిఎన్ కృష్ణ సాహో ఇంట్లో సోదాలు జరిపింది. నాలుగో తేదీన మరో కీలక నేత, ఎంపి అభిషేక్ ముఖర్జీ సన్నిహితుడు సంజయ్ కృష్ణ భద్ర, టిఎంసి నేతల ఇళ్ళలో సిబిఐ సోదాలు చేసింది. అలాగే బీహార్‌లో జెడియు,- ఆర్‌జెడి కూటమి అధికారంలో ఉన్న బీహార్‌లో ఫిబ్రవరి 25న అమిత్ షా పర్యటించారు.మార్చి 10న బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్రీ యాదవ్, ఆర్‌జెడి ఎంఎల్‌ఎ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు సయ్యద్ అబు దోజానా ఇళ్లలో ఇడి సోదాలు చేపట్టింది. మార్చి 11న తేజస్వి యాదవ్‌కు, సిబిఐ సమన్లను ఇచ్చింది. ఏప్రిల్ 2వ తేదీన మరోసారి అమిత్ షా బీహార్ పర్యటించారు. ఆ తర్వాత కూడా కేంద్రం దర్యాప్తు దాడులు కొనసాగాయి.

అలాగే జార్ఖండ్‌లో ఫిబ్రవరి 4వ తేదీన అమిత్ షా పర్యటించారు. ఫిబ్రవరి 21న గ్రామీణ అభివృద్ధి శాఖలో అక్రమాలు జరిగాయంటూ ఇడి దాడులు చేపట్టింది. మార్చి 4, మే 30 తేదీల్లో వివిధ కేసుల్లో ఇడి రైడ్ జరిపింది.సెంథిల్ బాలాజీ అరెస్టును విపక్షాలు ఖండించాయి. అరెస్టు చేసిన విధానం అభ్యంతరకరమని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అన్నారు. సిబిఐ, ఇడిలకు ‘బీజేపీ సైన్యం’ అని పేరు పెడితే బాగుంటుందని ఆయన విమర్శించారు. ఈనెల 23న జరగనున్న ‘విపక్షాల సమావేశాన్ని’ దెబ్బ తీయటానికి బిజెపి తమ దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నదని సెక్యూలర్ ప్రోగ్రసీవ్ అలయన్స్ ఆరోపించింది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు ) ఎంపి సంజయ్ రౌత్ స్పందిస్తూ బిజెపి నేతల అవినీతిపై ఆధారాలతో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసినా ఇడి, ఐటి లాంటి సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. ఇడి చర్యలు, బిజెపి చేస్తున్న రాజకీయ వేధింపులని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.

బిజెపి ఇంత చేస్తున్నా రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఎంత మాత్రం గెలవలేదని అన్నారు. ‘బిజెపి నాయకులు మూర్ఖులు’ వారు స్వర్గంలో వివరిస్తున్నారని’ సిపిఐ జనరల్ సెక్రెటరీ డి.రాజా వ్యాఖ్యనించ్చారు. ఈ రాజ్యాంగ సంస్థలు చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా సోదాలు చేస్తే ఎవరూ తప్పుపట్టరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రేరణతో దాడులు, వేధింపులు చేస్తేనే ఈ రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠ దెబ్బ తింటుంది. దేశంలో బిజెపి ఫాసిస్ట్ పాలన సాగిస్తుంది. ఈ బిజెపి పాలనలో ప్రజల ఆర్ధిక, సామాజిక సమస్యలపై మాట్లాడితే అపరాధం. ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడితే నేరం, పౌరహక్కుల అణచివేతపై ఉద్యమిస్తే తీవ్రవాది, వారిని అర్బన్ నక్సలైట్లు అంటూ ముద్ర వేస్తుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులపై అక్రమ కేసులు పెట్టింది. వారిని జైళ్ళలో నిర్బంధించింది. ఈ దేశ పౌరులుగా భారత రాజ్యాంగ ప్రకారం, ప్రజా స్వామ్యపంథాలో నడవాలని కోరుకునే హక్కు, బాధ్యత మనకు వుంది. ప్రజలు, పౌర సంఘాలు, విద్యార్ధులు, మేధావులు, ప్రతిపక్షాలు, కార్మిక, కర్షక సంఘాలు ప్రజాస్వామిక చైతన్యంతో శాంతియుత మార్గంలో ముందుకు నడవాలి. ఉమ్మడి, ఐక్య కార్యాచరణతో ఉద్యమాలు, పోరాటాల ద్వారానే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక హక్కులను మనం కాపాడుకోగలం.

* డా. కోలాహలం రామ్ కిశోర్, 9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News