కర్ణాటక ప్రభుత్వం వరుసగా తప్పుడు విధానాలు అమలులోకి తీసుకురావడం విమర్శలకు దారి తీస్తోంది. కర్ణాటక ప్రైవేట్ ఐటి కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకు 50% నుంచి 75% వరకు ఉద్యోగాలు తప్పనిసరిగా కేటాయించాలని ఇటీవల వివాదాస్పదమైన బిల్లును తీసుకురావడం, వివిధ వర్గాలనుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో యూటర్న్ కావడం తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో వివాదాస్పద బిల్లును తీసుకురాడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిద్ధంకావడం చర్చనీయాంశమవుతోంది. ప్రపంచస్థాయిలో ఐటి పవర్ హౌస్‌గా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటకలో ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి), ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటిఇఎస్) కంపెనీలు దాదాపు 5500 వరకు ఉన్నాయి. ఇవి కాక మల్టీనేషనల్ కంపెనీలు 750 వరకు ఉన్నాయి.
ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 1.3 మిలియన్ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. పరోక్షంగా వీటివల్ల మరో 3.1 మిలియన్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశం మొత్తం మీద సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచే 40% వరకు ఎగుమతులు ఉంటున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీల్లో 40% కర్ణాటకలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వారానికి 70 గంటలు పనిచేస్తే దేశ ఆర్థిక ప్రగతి వేగం పుంజుకుంటుందని, అనేక దేశాల్లో ఈ విధానం అమలవుతోందని ఐటి దిగ్గజం , ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇటీవల పదేపదే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం కాకపోయినా, కర్ణాటక ప్రభుత్వం మాత్రం నారాయణమూర్తి కలలను నిజం చేయాలనుకుంటోంది. ఐటి ఉద్యోగుల పని గంటలు పెంచుతూ కొత్త బిల్లును తీసుకురాడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం ఐటి రంగ ఉద్యోగులు ఓవర్‌టైం కలుపుకుని మొత్తం 12 గంటలు పనిచేస్తుండగా, కొత్తగా వచ్చే బిల్లు ప్రకారం మరో రెండు గంటలు ఎక్కువగా అంటే మొత్తం 14 గంటలు పనిచేయవలసి వస్తుంది. ఈ బిల్లును అమలులోకి తీసుకు వస్తే ప్రతికూల పరిణామాలు ఉంటాయని ఐటి ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తుండగా, ఇది తమ ఆలోచన కాదని, ఐటి సంస్థల యాజమాన్యాల నుంచి వచ్చిన ప్రతిపాదనలని సిద్దరామయ్య ప్రభుత్వం సర్దిచెబుతోంది. ఈ బిల్లుపై కొన్ని వేల మంది ఐటి ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ విధంగా అత్యధిక గంటలు పనిచేసే ఐటి ఉద్యోగుల్లో 45% మంది మానసిక సమస్యలకు బలవుతున్నారని, తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అనేక సంస్థలు తమ అధ్యయనంలో వెల్లడించాయి.
55% మంది శారీరక సమస్యలు ఎదుర్కొంటారని, వీరిలో 35% మంది బ్రెయిన్ స్ట్రోక్, 17% మంది గుండెజబ్బులకు బలవుతారని అధ్యయనాలు హెచ్చరించాయి. అయినా వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ 14 గంటలు తప్పనిసరిగా పనిచేయించాలనుకోవడం ఐటి ఉద్యోగుల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతోంది.ఐటి ఉద్యోగులు ప్రస్తుతం 10 వర్కింగ్ అవర్స్, రెండు గంటలు ఓవర్‌టైం మొత్తం 12 గంటలు పనిచేస్తుండగా, ఇప్పుడు 12 వర్కింగ్ అవర్స్, రెండు గంటలు ఓవర్‌టైంగా సవరించడానికి కొత్తగా బిల్లులో ప్రతిపాదించింది. అంటే మొత్తం 14 గంటలు ఐటి, ఐటిఇఎస్, బిపిఒ ఉద్యోగులు పనిచేసేలా సమయాన్ని పెంచింది. ఈమేరకు కర్ణాటక, షాప్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు 2024 (సవరణ)ను తీసుకురాడానికి ప్రయత్నిస్తోంది. రెండు గంటల ఓవర్‌టైమ్‌కు జీతం ఇవ్వరు.
ఈ బిల్లు అమలులోకి వస్తే మూడు షిఫ్టులకు బదులు రెండు షిఫ్టులే అమలులోకి వస్తాయని, ఐటి రంగంలో పనిచేసే 30 లక్షల మంది ఉద్యోగుల్లో మూడో వంతు మందిని తీసేసే అవకాశం ఉందని ఐటి కర్ణాటక ఐటి/ఐటిఇఎస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కర్ణాటకలోని ఐటి కంపెనీల యాజమాన్యాలు ఈ 14 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఇటీవలే ప్రతిపాదనలు పంపాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.14 గంటల పనిభారం ఉద్యోగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కార్మిక మంత్రి సంతోష్‌లాడ్, ఐటిబిటి శాఖ అధికారులతో భేటీ అయ్యారు. కార్మికుల వ్యక్తిగత జీవితానికి నష్టం కలగడమే కాకుండా, ప్రాథమిక హక్కులను అణగదొక్కేలా నిబంధనలు తీసుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మరోసారి చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం సినీ, సాంస్కృతిక కళాకారుల సంక్షేమం కోసం అన్నపేరుతో ఒక బిల్లును శాసన సభలో ఇటీవల ప్రవేశపెట్టింది. సినిమా టికెట్లపై 2% పన్ను పెంచింది. ఇది సినిమా రంగంలో ఆందోళనకు దారి తీస్తోంది. సినిమా టికెట్ల, ఒటిటి ఛార్జీలు పెంచడం ద్వారా ప్రేక్షకులపై భారం మోపుతున్నారని సినీరంగం మండిపడుతోంది.