బెంగళూరు: తాను ఎన్నికల కమిషన్‌కు మసర్పించిన పత్రాలన్నీ పారదర్శకమైనవని, ఆదాయం పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, లోకాయుక్తకు సమర్పించిన పత్రాలనే తన నామినేషన్ పత్రాలలో పొందుపరిచానని కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ శుక్రవారం స్పష్టం చేశారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనకు సమస్యలు సృష్టించడానికి ఐటి శాఖ తనను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. తనకు ఐటి శౠఖ నోటీసులు ఇచ్చిందని ఆయన తెలిపారు. న్యాయస్థానానికి చెందిన అంశాలను తాను మాట్లాడదలచుకోలేదని ఆయన చెప్పారు.
ఐటి శాఖ తీసుకునే ఎటువంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తాను హైకోర్టును ఆశ్రయిస్తానని, తన చివరి శ్వాస వరకు పోరాడతానని డికె తెలిపారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని ఆయనచెప్పారు. తనకు అన్యాయం జరిగిందని, తాను మొదటి నుంచి పారదర్శకంగా ఉన్నానని ఆయన చెప్పారు. కర్నాటక ప్రజలను బిజెపి బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు.
కరోనా, కరువు, మరే కష్టకాలంలోను డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలను ఆదుకోలేకపోయిందని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలను బిజెపి వేధిస్తోందని ఆయన తెలిపారు. ఇటువంటి ఒత్తిడులను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు.