Thursday, January 23, 2025

మరో 10మందికి ఐటి నోటీసులు

- Advertisement -
- Advertisement -

మంత్రి మల్లారెడ్డి ఐటి దాడుల వ్యవహారంలో ముగిసిన ఐటి విచారణ
మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో సహా మొత్తం 12 మందిని విచారించిన ఐటి అధికారులు
అడిగిన ప్రశ్నలన్నింటీకీ సమాధానమిచ్చామన్న మల్లారెడ్డి కుటుంబసభ్యులు
మరో పది మందికి ఐటి నోటీసులు
డిసెంబర్ 5వ తేదీవరకు వరుసగా ప్రశ్నించనున్న ఐటీ అధికారులు
నేడు మంత్రి మల్లారెడ్డి తరపున అడ్వకేట్ ఐటి విచారణకు హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఐటి దాడుల వ్యవహారంలో సోమవారం ఐటి విచారణ జరిగింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో సహా మొత్తం 12 మందిని ఐటి అధికారులు విచారించారు. మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సహా 12 మంది హాజరయ్యారు. ఐటి విచారణకు వచ్చిన వారిలో ఎంల్‌ఆర్‌ఐటి కాలేజీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, నర్సింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ మాధవి, మెడికల్ కాలేజీ అకౌంటెంట్, ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, మల్లారెడ్డి ఎడ్యుకేషన్ గ్రూప్ కు చెందిన ఇద్దరు అకౌంటెంట్స్ కూడా ఐటి విచారణకు హాజరయ్యారు. భద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను ఐదు గంటల పాటు విచారణ చేసిన ఐటి అధికారులు స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు.

నిర్దేశించిన ఫార్మాట్‌లో సీట్లు, ఫీజుల వసూలు వివరాలు
ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు, ఫీజు వసూలు పై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్‌లోనే వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఐటి అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాము సమాధానాలు చెప్పామని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని అవసరమనుకుంటే మరోసారి విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై వివరాలు అడిగారన్నారు. తాము చెప్పిన సమాధానాలతో ఐటి అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని తాము భావిస్తున్నామన్నారు. మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందన్నారు. ఇదే కేసులో మరి కొంతమందికి సమాన్లు ఇచ్చి విచారణ చేస్తామని ఐటి అధికారులు తెలిపారని రాజశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు.

అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చామన్న మల్లారెడ్డి కుమారుడు
మల్లారెడ్డి చిన్న కూమారుడు చామాకూర భద్రారెడ్డి కూడా ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చామని ప్రకటించారు. తమతో పాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంతమంది తమ సిబ్బందిని విచారణ చేశారని తమ స్టేట్మెంట్లతో పాటు తమ కళాశాల సిబ్బంది స్టేట్మెంట్లు రికార్డు చేశారన్నారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారని. ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలు సమర్పించాలని ఆదేశించారన్నారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు ఇవ్వాలన్నారని.. అధికారులు అడిగిన ఫార్మేట్ లో మేము పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

30వ తేదీన మరికొంత మంది విచారణ
ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డికి ఇంకా సమన్లు ఇవ్వలేదు, త్వరలో వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని తెలిపారు. ఐటి అధికారుల విచారణకు తాము అన్ని విధాల సహకరిస్తామని భద్రారెడ్డి తెలిపారు. ఉదయమే మర్రి లక్ష్మణ్ రెడ్డి, నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డిని విచారించారు. 30వ తేదీన మరోసారి విచారణకు రావాలని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డికి ఐటీ అధికారులు సూచించారు. విచారణకు హాజరవుతామని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి అన్నారు.
ఆ వివరాల ఆధారంగా…
కాగా, మూడ్రోజుల క్రితం 48 గంటల పాటు మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక డాక్యుమెంట్లు, లాప్‌టాప్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వాటిని విశ్లేషించిన ఐటి అధికారులు అందులోని సమాచారం ఆధారంగా వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆదాయపు పన్ను చెల్లింపు, టర్నోవర్‌లో వ్యత్యాసాలు ఉన్నట్లు అనుమానించిన ఐటి అధికారులు వాటి గురించి ఆరా తీసినట్లు సమాచారం. మొత్తం ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా వివరాలు తీసుకున్నారు.

మరో పది మందికి ఐటి నోటీసులు
తొలి రోజు మల్లారెడ్డి ఐటి సోదాల విచారణ ముగిసింది. మరో పది మందికి ఐటి అధికారులు నోటీసుల జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని పదిమందికి ఐటి సమన్లు ఇచ్చారు. సోమవారం విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా పదిమందికి ఐటి అధికారులు నోటీసులు ఇచ్చారు. డిసెంబర్ 5వ తేదీ వరకు వరుసగా ప్రశ్నించనున్న ఐటీ అధికారులు. విచారణలో మెడికల్ సీట్ల కేటాయింపుపైనే ఐటి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నేడు మంత్రి మల్లారెడ్డి తరపున ఐటి విచారణకు ఆడిటర్ హాజరు కానున్నారు.

IT Investigation Closed over raids on Malla Reddy house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News