Thursday, January 23, 2025

 ఇది జాతీయ, ప్రాంతీయ సంఘర్షణ

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడు దశల పోలింగ్‌లో మొదటి రెండు దశల పోలింగ్ పూర్తయింది. ఈ సందర్భం గా జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్యనే కాకుండా జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ మధ్య గట్టి సంఘర్షణ ఏర్పడింది. పదేళ్ల తరువాత, అలాగే 2019లో రాష్ట్ర, ప్రత్యేక హోదా పోయిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. రెండో దశలో 57% వరకు పోలింగ్ జరిగినా, పోలింగ్ శాతాల్లో ప్రాంతాల వారీ తేడాలు బాగా కనిపించాయి. రియాసీ జిల్లాలో 74.7% పోలింగ్ ఉండగా, శ్రీనగర్‌లో కేవలం 29.81% మాత్రమే పోలింగ్ కనిపించింది.

ఈ తేడాలు ఓటర్ల వైఖరిలో భిన్నాభిప్రాయాలకు దర్పణం పడుతున్నాయి. శ్రీనగర్‌లోని ఓటర్లలో అత్యధిక శాతం మందికి అసెంబ్లీ ఎన్నికలపై విశ్వాసం కుదరడం లేదు. ఇది అధికారం లేని కాగితం బొమ్మ అని, 2019లో తామేం కోల్పోయామో అది తిరిగి ఈ అసెంబ్లీ తీసుకు రాలేదన్న నిస్పృహ కనిపించింది. ప్రాంతీయ పార్టీలన్నీ తమను మోసగించాయన్న వ్యతిరేకత బయటపడుతోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటాయి? అన్న సందేహం కలుగుతోంది. ఇలా ఉంటే ఎన్నికల ఫలితాలు ఎవరికి పట్టం కడతాయో చెప్పలేం. పార్టీలన్నీ ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి తమ అజెండాలో ఎన్నో హామీలను ఎప్పటికప్పుడు చేర్చుకుంటున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి)లు ఈ రెండూ తిరిగి జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370, 35ఎను తిరిగి తీసుకువస్తామని, జైలు పాలైన యువతను విడిపిస్తామని, వారిపై కేసులను ఉపసంహరిస్తామని ఒకే విధమైన హామీలు ఇస్తున్నాయి.

అంతేకాదు నేరం చేయకపోయినా విచారణ లేకుండా నిర్బంధించడానికి ఉపయోగించే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పిఎస్‌ఎ)ను రద్దు చేస్తామని, వేర్పాటువాదులకు, మిలిటెంట్లకు సహాయ పడుతున్నారనే నెపంతో స్థానికులను నిర్బంధించడానికి ఉపయోగించే ప్రివెన్షన్ యాక్ట్‌ను ఎత్తివేస్తామని హామీలు ఇస్తున్నాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే అనుమానంతో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను గతంలో తొలగించారు. ఆ వివాదాన్ని పరిశీలించి తిరిగి వారిని నియమిస్తామని ఈ రెండు పార్టీలు హామీ ఇస్తున్నాయి. పోలీస్‌లు ఇచ్చిన వ్యతిరేక నివేదికల ఆధారంగా ఇదివరకు స్థానికులకు పాస్ పోర్టులు, ఉద్యోగాలు తిరస్కరించేవారు. అలాంటివి జరగకుండా చూస్తామని పార్టీలు భరోసా ఇస్తున్నాయి. రాష్ట్ర హోదా, పాకిస్థాన్‌తో తిరిగి చర్చలు ప్రారంభించడం అన్నవి కూడా ప్రాంతీయ పార్టీల ఎజెండాలో ప్రధానాంశాలుగా చోటుచేసుకున్నాయి.

రాష్ట్రహోదా హామీ పై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నా బిజెపి మాత్రం దానికి కట్టుబడి లేదు. ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 ను పునరుద్ధరించడానికి బిజెపి ఒప్పుకోవడం లేదు. దీన్ని కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలపై వ్యతిరేక అస్త్రంగా బిజెపి ప్రయోగిస్తోంది. అలా చేస్తే భారత్ లో మిగతా ప్రాంతంతో కశ్మీర్‌కు సంబంధం లేకుండా పరాయికరణ అవుతుందని హెచ్చరిస్తోంది. బిజెపి తన అజెండాను గెలవడానికి ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి జాతీయ నాయకులను ప్రచార రంగంలోకి దింపింది. దేశంలో మరెక్కడా లేని విధంగా బిజెపి తన సమీకరణ వ్యూహాన్ని కశ్మీర్‌లోనే కేంద్రీకరిస్తోంది. అయినా ఈసారి అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది.

నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, ప్రత్యేక హోదా విషయంలో ఆచితూచి అడుగువేయక తప్పడం లేదు. కశ్మీర్ విషయంలో కేంద్రం వైఖరిని పదేపదే తూర్పారపట్టే రాహుల్ గాంధీ ఆర్టికల్ 370 విషయం వచ్చేసరికి మౌనం పాటిస్తున్నారు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ బిజెపి కీలుబొమ్మ అని, గవర్నర్ ద్వారా కశ్మీర్ పాలనాధికారాన్ని కేంద్రం అధీనంలో ఉంచుకోవడానికి, స్థానిక రాజకీయ నాయకత్వాన్ని బలహీనం చేయడానికి బిజెపి పన్నాగాలు పన్నుతోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఇక బిజెపి, కాంగ్రెస్ అజెండాకు, పాకిస్థాన్‌కు మధ్య సంబంధాన్ని అంటగడుతోంది. ఈ ఎన్నికల రంగం పార్టీల తీవ్ర సంఘర్షణగా మారింది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ను సందర్శించడానికి 15 మంది విదేశీ ప్రతినిధుల బృందం రావడం దేనికోసం అన్న విమర్శలు వస్తున్నాయి.ఈ ప్రతినిధుల సందర్శన అంతా ముందుగా మార్గదర్శకం చేసిన కార్యక్రమంగా ఆరోపించాయి. వీరితోపాటు విదేశీ జర్నలిస్టులను ఎందుకు ఆహ్వానించ లేదు అని ప్రశ్నిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News