Wednesday, January 22, 2025

అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటు!

- Advertisement -
- Advertisement -

అప్పులు తీర్చాలంటే తెలంగాణ ప్రజలు చెమట చిందించాల్సిందే?
విభజన హామీలు, బకాయిల విడుదలపై మోడీని కలుస్తున్నాం
బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద కలిసిన మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్ పేరిట బిఆర్‌ఎస్ స్వేద పత్రం రిలీజ్ చేయడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావ మరది చెమట కక్కి సంపాదించారా? అని కెటిఆర్, హరీష్‌రావులను ఉద్దేశించి భట్టి వ్యాఖ్యానించారు. మంగళ వారం ఢిల్లీ పర్యటన ముందుకు ఆయన బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు తెలంగాణ ప్రజల చెమటతో వచ్చాయని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలని, ఇందులో బిఆర్‌ఎస్ వాళ్లు చేసిన గొప్పతనం ఏముందని భట్టి వ్యాఖ్యానించారు.

దశాబ్ద కాలంగా పరిపాలన చేసిన బిఆర్‌ఎస్ అడ్డగోలుగా రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి, ఆస్తులు సృష్టించామని గొప్పగా సమర్ధించుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమా? కాదా? రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని భట్టి వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయం పెంచామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బిఆర్‌ఎస్ 10 సంవత్సరాల కాలంలో పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా, ధనవంతులు సంపన్నులుగా మారారన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక సంపన్నుడికి రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక పేదవాడు 40 చదరపు గజాల్లో ఇల్లును నిర్మించుకున్నారని వీరిద్దరి తలసరి ఆదాయం ఒకే విధంగా పెంచామని బిఆర్‌ఎస్ చెప్పడం సమంజసం కాదన్నారు.

రాష్ట్రంలో ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేశారా?
పది సంవత్సరాల కాలంలో అప్పులు చేసిన బిఆర్‌ఎస్ ఆస్తులను సృష్టిస్తే మరి కళ్లకు కనిపించాలి కదా! రాష్ట్రంలో ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేశారా? కొత్తగా సర్వీసు సెక్టార్ ఏర్పాటు చేశారా,? కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చారా,? కోల్ ఇండస్ట్రీయల్ ఏమైనా నెలకొల్పారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా తెచ్చారా? రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావలసిన హామీలను 10 సంవత్సరాలుగా తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందిన బిఆర్‌ఎస్ అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని గొప్పగా సమర్ధించుకోవడం సిగ్గుచేటు అని భట్టి విమర్శించారు. 1956 నుంచి 2013 సంవత్సరం వరకు తెలంగాణకు కేటాయించిన ఐదు లక్షల కోట్ల బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు నాగార్జునసాగర్, జూరాల, శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, దేవాదుల, కడెం, కోయిల సాగర్ ప్రాజెక్టులను నిర్మించాయని, నాగార్జునసాగర్ లెఫ్ట్, రైట్ కెనాల్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తున్నారని భట్టి వివరించారు.

మీరు ఏమీ అభివృద్ధి చేశారు ?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బిహెచ్‌ఎల్, ఈసీఐఎల్, బిడిఎల్ లాంటి పరిశ్రమలను నెలకొల్పడానికి కావాల్సిన భూమి, కరెంటు, నీళ్లు తదితర సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఏర్పాటుకు దోహదపడ్డాయన్నారు. మీరు ఏమీ అభివృద్ధి చేశారని ఏడు లక్షల కోట్లు రూపాయలు అప్పు చేశారని భట్టి నిలదీశారు. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కక్కిస్తామని చెప్పినట్లుగా జ్యూడీషల్ విచారణకు ఈ ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ప్రజలకు చెందాల్సిన సంపదను దోపిడీ చేసిన గత పాలకుల అవినీతిపై విచారణ మొదలైందని, లెక్కలు కట్టి వారి నుంచి దోపిడీ చేసిన సొమ్మును కచ్చితంగా కక్కిస్తామని ఆయన వెల్లడించారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి..
రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావలసిన హామీలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన బకాయిల గురించి ప్రధాని మోడీని కలుస్తున్నామని భట్టి చెప్పారు. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచింగ్, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.

తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి నిధులను రాబట్టే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీకి వెళుతున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినందున పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేయనున్నట్లు భట్టి పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడంతో పాటు రాష్ట్రం నుంచి ఆ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టే నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించుకునే వెసులుబాటు దొరుకుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News