బాంబే హైకోర్టు వ్యాఖ్య
ముంబై : ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను స్త్రీలోలుడు, తాగుబోతు అంటూ భార్య ఆరోపించడం క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు వెల్లడించింది. దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజాగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. స్థానికంగా ఉండే రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని 2005 నవంబరులో పుణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహిళ హైకోర్టు అప్పీల్ విచారణ పెండింగ్‌లో ఉన్న సమయం లోనే ఆర్మీ అధికారి మరణించడంతో అతని చట్టపరమైన వారసుడిని ప్రతివాదిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. మహిళ తన అప్పీలులో భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఆల్కహాలిక్ అని పేర్కొంది. ఈ దురలవాట్ల కారణంగా తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదని , తనకు అందాల్సిన ప్రతిఫలాలు దక్కలేదని ఆరోపించింది. దీనిపై కోర్టు విచారణలో పై విధంగా వ్యాఖ్యానించింది.