Saturday, November 23, 2024

బాల బాలికల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ః బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో తొమ్మిదవ విడత ఆపరేషన్ ముస్కాన్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా ప్రమాదకర ప్రదేశాలలో పనిచేస్తున్నట్లైతే వారిని గుర్తించి రక్షించాలన్నారు. పనిచేయిస్తున్న యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరికి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

జులై 1వ తేది నుంచి జులై 31వ తేది వరకు నిర్వహించే 9వ విడత ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసుల బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, సఖి సెంటర్, విద్యాశాఖ, వివిధ శాఖల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బాలల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటాయన్నారు. సిబ్బందితో పాటు ప్రజలు సహకరించాలని అన్నారు. బాల కార్మికులు కిరాణం షాపులో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ రోడ్లపై వదిలివేయబడిన పిల్లలు, భిక్షాటన చేస్తున్న పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలు ఉన్నట్లైతే గుర్తిస్తారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోంకు పంపించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

అధికారులు వారం రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా చేపట్టిన 212 కేసుల్లో ఎంత మందిని ఏఏ వసతి గృహాల్లో పంపించారు మొత్తం రిపోర్టును తమ దృస్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా 1098 చైల్డ్ ప్రొటెక్షన్ నెంబర్‌కు వచ్చిన కాల్స్ వివరాలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో బాల కార్మిక నిర్మూలన వ్యవస్థలకు అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు బంగారు జీవితాన్ని అందించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి రామేశ్వర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని వెంకటలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మెన్ లక్ష్మణ రావు, బిసి వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, జిల్లా ఇమినైజేషన్ అధికారి రవి నాయక్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నిరంజన్, ఎన్‌జిఓలు రామకృష్ణ, నాధాశ్రమం నిర్వాహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News