Wednesday, January 22, 2025

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తామనడం మంచిది కాదు

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీలో నాది సెంటర్ బెంచ్.. కమ్యూనిస్టు పార్టీ : ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు

మన తెలంగాణ / హైదరాబాద్ : ‘ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం అని అనడం మంచిది కాదని, సిపిఐ ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివ రావు అన్నారు. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

శాసనసభ సమావేశాలు ఆరోగ్యవంతమైన, నిర్మాణ పద్ధతిలో జరగాలని, ఎంతో పవిత్రమైన సభలో మార్షల్స్ అవసరాలు లేకుండా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తలసరి ఆదాయంతో పాటు అనేక ర్యాంకింగ్ నంబర్ వన్ ఉన్న సౌభాగ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఎందుకు వేతనాలు ఇవ్వలేక పోయారని తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వం కొన్ని తప్పిదాల వల్ల అధికారానికి దూరం అయిండవచ్చని, అటువంటి తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన పది రోజుల శాసనసభ సమావేశాలు క్వాలిటీ చర్చ కాదని, బడ్జెట్, బడ్జెట్ పద్ధులపైన ఒకే రోజులో చర్చను పూర్తి చేశారని, గత ప్రభుత్వ తరహా కాకుండా నిబంధనల ప్రకారం పాత సాంప్రదాయాలను కొనసాగిస్తూ సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించారు. ప్రభుత్వానికి విల్ పవర్, ప్లానింగ్, చిత్తశుద్ది ఉంటే హామీల అమలు సాధ్యమేనని కూనంనేని అన్నారు. గత వైఎస్ ఇచ్చిన అనేక వాగ్ధానాలు గెలిచాక ఆయన చివరకు అనుకున్న లక్షాలను చేరుకున్నారని గుర్తు చేశారు.
నాది సెంటర్ బెంచ్..కమ్యూనిస్టు పార్టీ
కాంగ్రెస్ మద్దతుతో గెలిచినప్పటికీ తనది సెంటర్ బెంచ్ (అధికార, ప్రతిపక్షం మధ్య ) అని , ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి చెబుతానని కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘మీరు 65 మంది, మేము 54 మంది అని’ కెటిఆర్ చెప్పారని, తనను అటు వైపు(కాంగ్రెస్) వేశారని, అంటే బిఆర్‌ఎస్, ఎంఐఎం , బిజెపి ఒక్కటే అనే భావన కలిగేలా కెటిఆర్ చెప్పారని వివరించారు. సభ్యలందరూ కలిసి నిర్మాణ పథంలో ఉండాలన్నారు. ప్రాజెక్ట్ ఖర్చు పెడుతున్న నిధులలో కిందికి వెళ్లేది పావలా మాత్రమేనని నాటి రాజీవ్ గాంధీ చెప్పారని, ప్రస్తుతం ఆ పావల కూడా అందడం లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు.

ఒక లక్ష కోట్ల రూపాయాలలో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ ఖర్చు అవుతుందని, మిగిలిని నిదులు ఏ రూపంలో వెళ్తుందో తెలియడం లేదన్నారు. ఇటువంటివి నియంత్రించ గలిగితే డబ్బులు పెద్ద సమస్య కాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుండి చాలా రావాల్సి నిధులు ఉన్నాయని, సుమారు రూ.70వేల కోట్ల వరకు కేంద్ర బకాయిలు ఉన్నాయని తెలిపారు. అధికారంలోనికి వచ్చిన 24గంటల్లోనే ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి ఆరు గ్యారంటీల దస్త్రాంపై సంతకం చేసినట్టు ఉన్నారని, కానీ ఈలోపే శాసనసభ సమావేశాలు వచ్చి ఉంటాయన్నారు. గత ప్రభుత్వంలోని మంచిని కొనసాగిస్తూ వారి తప్పులను అర్థంచేసుకుని , సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదీ చేయలేదనేది సరైంది కాదని, ఏదో కొంత చేసిందని, వాటి ఆధారంగా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటిని ముందుకు తీసుకెళ్లాయని తెలిపారు.
ఎంఎల్ఎ లను కొనుగోలు చేస్తారా?
‘మీరు’ ఇంకెంత కాలం ఉంటారో చూస్తాం.. ఈ ప్రభుత్వం ఒక సంవత్సం కూడా ఉండదనే’ భాష మంచిది కాదని, ఇది తప్పు అని బిఆర్‌ఎస్ సభ్యులకు కూనంనేని సాంబశివ రావు హితువు పలికారు. ఒక సంవత్సరం కూడా ప్రభుత్వం ఉండబోదంటే , ఇక ఎంఎల్ ఎలను కొనుగోలు చేస్తారా? బేరసారాలు మొదలు పెడుతారా? అని ప్రశ్నించారు. ఇటువంటి పదాలు వాడడం సరికాదన్నారు. గతంలోనూ, ఇప్పుడూ చంద్రబాబు, కెసిఆర్ లాంటి ప్రముఖులు ఓడిపోయారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి చేస్తే ఉంటుందని, లేదంటే.. ఓడిపోతారని చెప్పారు. తెలంగాణ ప్రజల నీతి నిజాయితీని పక్కదారి పట్టించొద్దని పలు పార్టీలకు సూచించారు. గత పదేళ్ల కాలంలో కొనుగోలు,అమ్మకాలు, విపరీత స్థాయిలో జరిగాయని, రాజకీయ నాయకులను ఎంత మంది కొనుగోలు చేశారో, ఎంత మంది అమ్ముడుపోయారో అని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అమ్ముడుపోయిన వారిని శాసనసభకు రాకుండా ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. సర్పంచ్ ఎంపిటిసిలను కొనుగోలు చేస్తున్నారని, ఇంత పైసలు ఎక్కడి నుండి వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పౌరుషాల, పోరాట గడ్డ అని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News