న్యాయవ్యవస్థను పరిరక్షించుకునే బాధ్యత న్యాయవాదులదే
సిజెఐ ఎన్‌వి రమణ ఉద్బోధ
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉద్దేశపూర్వక దాడులనుంచి న్యాయవ్యవస్థను రక్షించుకునే బాధ్యత న్యాయవాదులదేనని తెలిపారు. న్యాయవ్యవస్థ అనే కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే రాజ్యాంగ మూలసూత్రమని.. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైనదని గుర్తు చేశారు. నిజం వైపు నిర్భయంగా నిలవడంతోపాటు తప్పును అంతే స్థాయిలో ఖండించాలన్నారు. రాజ్యాంగ మూల సూత్రాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లేలా ప్రతిజ్ఞ చేద్దామన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ , జవహర్‌లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, సర్దార్ పటేల్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ చేసిన సేవలను మరువలేమన్నారు. ఎందరో న్యాయవాదులు దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం అంటే వారికి నివాళులర్పించినట్లేనని సిజెఐ అన్నారు.