Thursday, January 23, 2025

రైతులను గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీయే

- Advertisement -
- Advertisement -

హాజీపూర్: రైతులను అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించారు. రైతులకు ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ హాజీపూర్ మండలంలోని గుడిపేట రైతు వేదిక రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్షం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి అదే పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు, ఎరువులు, నీళ్ళు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగు చేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి రైతన్న ఆత్మహత్యలకు కారణమైందని విమర్శించారు.

ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు.

నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పులు వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవన్నారు. ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేసేవారని గుర్తు చేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేస్తూనే మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేశారని తెలిపారు.

ఇప్పటికైన రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని, రైతుల వెన్నంటి ఉండే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News