Sunday, November 24, 2024

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్సే

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని,వారి హాయాంలో లో ఓల్టేజి విద్యుత్ సరఫరాతో కాలిపోయిన విద్యుత్ మోటార్లు, ఓవర్ లోడ్‌తో పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటూ మాట్లాడిన తీరుపై బుధవారం జగిత్యాల రూరల్ మండలం పొలాస రైతు వేదికలో రైతన్నలు నిరసన తెలిపి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, సాగునీరు, విద్యుత్ కష్టాలతో ఆనాడు రైతులు పడ్డ గోసను చూసి రైతుల కష్టాలను తీర్చేందుకు సిఎం కెసిఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగు నీటి కష్టాలను దూరం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు.

24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులు ఎప్పుడు పడితే అప్పుడు పంటలకు నీరు పెట్టుకునే అవకాశం ఉండగా, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రోజుకు 9 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రకటించి మూడు నాలుగు గంటలకు మించి ఇవ్వకపోవడంతో రైతులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా వ్యవసాయ బావుల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చేదన్నారు.

లో ఓల్టేజి సమస్యతో తరచూ మోటార్లు కాలిపోయేవని, ఒకే సమయంలో మోటార్లన్నీ నడవడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడి పేలిపోయేవన్నారు. వారం పది రోజులైనా ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మత్తులు చేయకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగలా తీర్చిదిద్దితే ఓర్వలేని కాంగ్రెస్ నేత రేవంత్ మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని మాట్లాడటం సరికాదన్నారు.

గతంలో అన్నదాతలను ఆగం చేసిన కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. వ్యవసాయ రంగానికి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, వారి పాలనలో వ్యవసాయానికి ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చారు… పంటల విస్తీర్ణం ఎంత… కాలిపోయిన విద్యుత్ మోటార్లు ఎన్ని… ట్రాన్స్‌ఫార్మర్లు ఎన్ని… విద్యుత్ షాక్‌తో మరణించిన రైతులు ఎంత మంది… రాత్రి పూట కరెంట్‌తో ప్రమాదాలకు గురైన వారెందరు…అప్పుల పాలై ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వివరించాలన్నారు.

జిల్లాలో 2014లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, 2023లో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. నిరంతర విద్యుత్, సాగు నీరు అందించడం వల్లే 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి పెరిగిందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలన్నారు. గతంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు వెళ్లి బావుల వద్ద స్నానం చేసేందుకు 10 నిమిషాలు త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలని విద్యుత్ అధికారులను వేడుకున్నది నిజం కాదా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

రైతులకు మంచి చేసే కెసిఆర్ కావాలో, రైతులను నిండా ముంచే ప్రతిపక్షాలు కావాలో రైతులు ఆలోచన చేయాలన్నారు. పొలాస క్లస్టర్‌లోని రైతులకు ఇప్పటి వరకు 6 విడతల్లో రూ.23.84 కోట్ల రైతుబంధు సాయం అందించడం జరిగిందన్నారు. అలాగే వివిధ కారణాలతో చనిపోయిన రైతులకు రూ.2.5 కోట్ల రైతుబీమా పరిహారం అందించినట్లు వివరించారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గురించి ప్రతి చోట చర్చ జరగాలని, రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత, ఎంపిపి పాలెపు రాజేంద్రప్రసాద్, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు బాలముకుందం, ఫ్యాక్స్ చైర్మన్ సందీప్‌రావు, మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు తిరుపతి, ప్రవీణ్, ఎంపిటిసి, ఉప సర్పంచ్‌లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News