Friday, November 22, 2024

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్: విద్యార్థులను భావి భారతపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా దినోత్సవాలు నిర్వహించారు.

ముందుగా జిల్లా కలెక్టర్ అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరిలోనూ గౌరవప్రదమైన స్థానం ఉండేది ఉపాధ్యాయులకేనని , వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండే వారందరిని తయారు చేసింది ఉపాధ్యాయులేనని ఆయన పేర్కొన్నారు. ప్రాణం పోసే డాక్టర్‌ను భగవంతుడిగా భావిస్తారని అలాంటి వారిని తయారు చేసి తీర్చిదిద్దేది కూడా ఉపాధ్యాయులేనని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని ఆయన కొనియాడారు.

పిల్లలకు తల్లిదండ్రుల మాట కంటే ఉపాధ్యాయులు చెప్పేవే వేదవాక్కుగా భావిస్తారని ఆయన అన్నారు. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషిస్తారని అని తెలిపారు. ఉపాధ్యాయులు తప్పులు చెబితే సమాజాన్ని తప్పుదోవ పట్టించిన వారవుతారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదని, తెలియని విషయం తెలుసుకొని విద్యార్థులకు బోధించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడి విద్యాబోధన చేస్తే ఫలితాలు కచ్చితంగా వస్తాయని, ఆ దిశలో పని చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు.

గత తొమ్మిది సంవత్సరాల కాలంలో విద్యా రంగంలో సాధించిన ప్రగతిని నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో విద్యారంగ అభివృద్ధిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ, గురుకుల పాఠశాలలో ప్రభుత్వం అన్ని రకాలుగా కార్యక్రమాలను నిర్వహించి గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని అన్నారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలో అభివృద్ధి చేసుకొని విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా నోటు పుస్తకాలు యూనిఫాం, భోజన సౌకర్యం కూడా కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని కొత్తగడి సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల విద్యార్థులు నీట్ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించి ఎంబిబిఎస్ ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన, ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉంటారని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పదవ తరగతిలో మంచి ఫలితాలు వచ్చే విధంగా సవాల్‌గా స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులు పేద విద్యార్థులేని వారిని దృష్టిలో పెట్టుకుని గతంలో జరిగిన తప్పులను గుణపాఠంగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ హితవు పలికారు. బీసీ కమిషన్ సభ్యులు శుభ్రత్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందించి భవిష్యత్తులో జిల్లా నుండి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లను తయారు తయారుచేసి జిల్లాకు మంచి పని తీసుకోవాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గొప్ప వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన వారేనని వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను అతిధులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఉత్తమ సేవలందించిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు శాలువా మెమోంటోలతో సత్కరించారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలల అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలను అతిథులు సన్మానించారు. ఉదయం తెలంగాణ విద్యా దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి పెద్ద ఎత్తున విద్యార్థిని, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. విద్యా సంస్థలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మన ఊరుమనబడి కింద పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలను, డిజిటల్ తరగతులను సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్రైనే కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News