Friday, November 15, 2024

విదేశీ గడ్డపై విలవిల!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ఇంతకాలం ఐటి ఉద్యోగార్థులకు ఎంతో ఆకర్షణీయ గమ్యాలుగా వుండిన అమెరికన్ కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని తొలగిస్తూ వీధుల పాలు చేస్తున్న దృశ్యం తీవ్ర ఆందోళనకరమైనది. ఇలా తొలగిస్తున్న వారిలో భారతీయ నిపుణులే ఎక్కువగా వున్నారన్న సమాచారం, అందులో తెలుగు వారు కూడా గణనీయమైన సంఖలో వున్నట్టు వస్తున్న వార్తలు మరింత బాధాకరమైనవి. అమెరికన్ కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించిన వెంటనే వారు అమెరికాలో నివాసార్హత కూడా కోల్పోతారు. కేవలం రెండు నెలలు మాత్రమే అక్కడ వుండగలుగుతారు. ఆలోగా అక్కడే మరో చోట ఉద్యోగం లభిస్తే సరి, లేకపోతే పరుపు, మంచం వీపున వేలాడవేసుకొని స్వదేశం చేరుకోవలసిందే, ఇంటి ముఖం పట్టి తీరవలసిందే.

ఇప్పుడు ఈ దుస్థితిలో వేలాది మంది విలవిలలాడుతున్నారు. కొత్త ఉద్యోగ ఖాళీల కోసం గాలింపు మొదలు పెట్టారు. వాట్సాప్ గ్రూపులుగా ఏర్పడి ఒకరికొకరు సహకరించుకొంటున్నారు. అక్కడ ప్రవాస భారతీయ సంఘాల సహకారం అందుకొంటున్నారు. అయినా అన్ని కంపెనీలు కట్టగట్టుకొని ఒకదాని వెంట ఒకటి వేలం వెర్రిగా ఉద్యోగాల ఊచకోతకు తెగిస్తుంటే కొత్తగా అవి ఎక్కడ లభిస్తాయి. 2022లో అమెరికాలోని 1000కి పైగా కంపెనీలు 1,54,000 మంది ఉద్యోగులను వీధిన పడేశాయని సమాచారం. ఈ ఏడాది ఇంకా నెల రోజులు గడవక ముందే ఇప్పటికే 55,000 మందిని వదిలించుకొన్నట్టు తెలుస్తున్నది. మనకు లభిస్తున్న సమాచారం సంపూర్ణమైనది కాదు కాబట్టి ఈ సంఖ్య ఇంతకు అనేక రెట్లు వున్నా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఫేస్‌బుక్ పూర్వపు సంస్థ మెటా 11,000 మందికి, అమెజాన్ 18,000 మందికి, గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ 12,000 మందికి, మైక్రోసాఫ్ట్ 10,000 మందికి, ట్విటర్ 3700 మందికి, శ్నాప్‌చాట్ 1000 మందికి ఇంకా స్పాటిఫై తదితర సంస్థలు మరి కొన్ని వందల మందికి ఉద్వాసన పలికినట్టు స్పష్టపడుతున్నది.

అసలెందుకీ ఆకస్మిక నరికివేత. ఆ కంపెనీల కొంపలు ఏమి మునిగిపోయాయని? అత్యధిక జీతాలను ఇవ్వజూపి స్వదేశాల నుంచి పెకలించుకుపోయిన వారిని అర్ధాంతరంగా ఇలా నడి సముద్రంలో ముంచడంలోని ఔచిత్యం ఏమిటి? ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి జీతాలు తక్కువైనా ఉద్యోగ భద్రత వుంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన ఈ నిపుణులకు స్వదేశంలో అటువంటి అవకాశాలు విరివిగా లభిస్తాయి. వాటిని కాలదన్నుకొని అమెరికా అనే స్వర్గంలో చోటు దొరికిందనే ఆనందంతో వెళ్ళిన వారికి రెండు మాసాల్లో అక్కడి నుంచి గెంటివేత తప్పదనే దుస్ధితి ఏల ఎదురవుతున్నది? ప్రపంచం కనీవినీ ఎరుగని మాంద్యంలోకి, గిరాకీ పతనంలోకి ప్రవేశించబోతున్నదనే జోస్యం ఒక్కటే ఆ కంపెనీలను ఈ ఉద్వాసన ఉత్తర్వుల మార్గం పట్టించిందని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఉద్యోగులను వదుల్చుకోవలసినంత దారిద్య్రంలోకి ఈ కంపెనీలు కూరుకుపోవు. వాటి లాభాలు తగ్గడం మాత్రమే జరుగుతుంది. ఇన్నాళ్ళూ తమకు సేవ చేసిన ఉద్యోగుల కోసం ఈ కంపెనీలు ఆ మాత్రం త్యాగం చేయలేవా? అలాగే కొద్ది రోజులు, మాసాల ముందు ఉద్యోగాలు ఇచ్చిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా లేఆఫ్ చేయడం ఎంత దుర్మార్గం? టేకాఫ్‌కి లేఆఫ్‌కి మధ్య వ్యవధి కూడా వుండొద్దా? అక్కడికి పోయి ఇంకా గట్టిగా నిద్ర తీయకుండానే ఉద్యోగాల నుంచి తొలగించి పొమ్మనడమా? ఈ వరుస చూస్తుంటే అమెరికాలో ఈ తొలగింపుకి గురయ్యే బయటి దేశాల ఉద్యోగుల సంఖ్య భారీ స్థాయికి చేరేలా వుంది.

అందుచేత హెచ్1బి (నిపుణ ఉద్యోగులు) వీసాల మీద వెళ్ళిన వారిని మరి కొంత కాలం అమెరికాలో కొనసాగనిచ్చేలా వీసా నిబంధనలను సవరించాలంటూ చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ దయనీయ స్థితినుంచి మన టెకీలను కాపాడాలి. అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిన అవసరం తలెత్తింది. ఈ బాధ్యతను మన కేంద్ర ప్రభుత్వమే వహించాలి. ఎందుకంటే మనకున్న విశాలమైన మార్కెట్‌ను అక్కడ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాము. మన రైతులు దారిద్య్రంలోకి కూరుకుపోతారని తెలిసి కూడా అమెరికా పంటలకు భారతీయ మార్కెట్‌లో అవకాశం కల్పిస్తున్నాం. అలాగే మరెన్నో అమెరికన్ ఉత్పత్తుల రాకకు తలుపులు బార్లా తెరిచాము. అందుకు ప్రతిగా అక్కడి మన నిపుణులను మరి కొంత కాలం అనుమతించేలా బైడెన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తన పలుకుబడిని ఉపయోగించాలి. అమెరికన్ టెక్ కంపెనీలు తక్కువ వేతనాలకు (అమెరికన్లకు ఇచ్చే వేతనాల కంటే బహు స్వల్పం) ఎక్కువగా శ్రమించి ఫలితాలను సాధించి పెడతారనే కారణం మీదనే మన నిపుణ విద్యావంతులకు ఉద్యోగాలిస్తున్నాయి. వీరు కట్టే పన్నులతో ప్రభుత్వ ఆదాయం విశేషంగా పెరుగుతుందని తెలిసి అమెరికా వీరికి వీసాలు ఇస్తున్నది. మన వారికి వారు దయ తలచి చేస్తున్నదేమీ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News