Sunday, January 19, 2025

బీటలు వారుతున్న ఐటి కోట

- Advertisement -
- Advertisement -

నిన్నమొన్నటి వరకూ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ సాప్ట్‌వేర్ రంగం. గత మూడు దశాబ్దాలుగా నిరుద్యోగులకు కల్పవృక్షంలా మారి, లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి చూపించిందనడంలో సందేహం లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే లక్షల్లో జీతం. లగ్జరీ జీవితం. అంబాజీపేట నుంచి అమెరికా వరకూ యువతకు బాటలు వేసింది ఈ సాఫ్ట్‌వేర్ రంగమే అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు డిగ్రీ అంటే బిఎ, బికాం, బిఎస్‌సి అనేవారు. కానీ ఆ తర్వాత డిగ్రీకి బిటెక్ పర్యాయపదంలా మారిపోయింది. అమెరికాలో ఉద్యోగాలు అందిపుచ్చుకుని, అక్కడే గ్రీన్ కార్డు సంపాదించి స్థిరనివాసం ఏర్పరచుకున్నవారి సంఖ్య యాభై లక్షల పైచిలుకే. అగ్రరాజ్యంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఇతర దేశస్థులలో భారతీయుల సంఖ్యే అధికం.

అయితే కరోనా తదనంతర పరిణామాల్లో అనేక ఇతర దేశాల మాదిరిగానే అగ్రరాజ్యం కూడా ఒడిదుడుకులకు లోనైంది. దాని ఫలితం సాఫ్ట్‌వేర్ రంగంపైనా పడింది. 2020లో మొదలై, దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అనేక ఐటి కంపెనీలు మూతబడ్డాయి. ఈ పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది.దరిమిలా సదరు కంపెనీలు భారీయెత్తున నియామకాలు చేపట్టాయి. ఆర్డర్లు అందిపుచ్చుకున్నాయి. కానీ, ఇదే సమయంలో ప్రభుత్వం ప్యాకేజీలను ఉపసంహరించుకోవడంతో ఐటీ పరిశ్రమల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గిపోవడం, బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచడం, మునుపటి మాదిరిగా ఆర్డర్లు రాకపోవడంతో ఐటి పరిశ్రమల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగ తయారైంది. చేయాల్సిన పని కంటే పని చేసేందుకు కంపెనీల్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువకావడంతో యాజమాన్యాలు ఉద్యోగాల్లో కోత విధించడం మొదలుపెట్టాయి. దీని ప్రభావం భారతీయులపైనే ఎక్కువ పడిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికాలో డాలర్లలో సంపాదించుకోవచ్చనే ఆశతో మన దేశస్థులు ఏటా భారీ సంఖ్యలో ఆ దేశానికి పయనమవుతూ ఉంటారు. ఎంఎస్ వంటి కోర్సులు చేసి, అక్కడే ఉద్యోగాలు సంపాదించుకుని, స్థిరపడుతున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.

ఒక్క 2022- 23 సంవత్సరంలోనే ఇలా రెండు లక్షల మంది అమెరికాకు వెళ్లినట్లు అంచనా. వీరిలో తెలుగు విద్యార్థుల సంఖ్య యాభైవేలకు పైగానే ఉంటుంది. ఇలా వెళ్లినవారిలో నూటికి 85 మందికి అక్కడే ఉద్యోగాలు కూడా లభించేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో అమెరికాలో భారతీయ నిరుద్యోగుల సంఖ్య రానురాను పెరిగిపోతోంది. అమెరికా లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక నిరుద్యోగులు సతమతమవుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. పొట్ట పోషించుకునేందుకు రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లలో పని చేస్తూ కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోనూ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఏమీ లేకపోవడం గమనార్హం. ఐటి రంగంలో ఈ ఏడాది జనవరినాటికి 50 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ అయినట్లు అంచనా. అయితే రెండేళ్ల క్రితంనాటి నియామకాలతో పోలిస్తే 60 శాతం తగ్గినట్లు ప్రముఖ ఉద్యోగ కల్పన సంస్థ లింక్ డిన్ సర్వేలో తేలింది. చిన్నా చితకా ఉద్యోగుల కంటే భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులపైనే ఎక్కువగా వేటు పడుతోంది. ఆర్థికభారం తగ్గించుకోవాలన్న యాజమాన్యాల ఆలోచనే దీనికి కారణం.

కేవలం ఐటి సంస్థలే కాదు, హెచ్‌ఎస్‌బిసి, మోర్గాన్ స్టాన్లీ, నైకే, టెస్లా వంటి ఐటీయేతర బడా కంపెనీల్లోనూ ఉద్యోగాల కోత భారీగానే ఉండటం ఆందోళనకరం. ఈ పరిణామానికి కృత్రిమ మేధను కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నిన్నమొన్న కళ్లు తెరిచిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఒక్కొక్క రంగాన్ని కబళిస్తూ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కొల్లగొడుతోంది.ఉద్యోగులకు వేతనాల రూపేణా లక్షలాది డాలర్లు వెచ్చించే బదులు కృత్రిమ మేధను అందిపుచ్చుకుంటే పని సులువవుతుందనే ధోరణి ఐటి కంపెనీల యాజమాన్యాలలో ప్రబలింది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి చేయూతనిస్తే ఐటితో పాటు ఇతర రంగాలు కూడా కోలుకునే అవకాశాలు ఉన్నాయని కంపెనీల యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పన్నుల రూపం లో ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలిచే లక్షలాది ఉద్యోగులు ఏ దేశానికైనా కీలకమే. భారత దేశంలోనూ తాజాగా అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం రూపొందించే నూతన పారిశ్రామిక విధానంపైనే నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరే దిశగా నూతన విధానాల రూపకల్పనతో పారిశ్రామిక సంస్థలకు ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News