Friday, November 22, 2024

ఐటీ మంత్రిగా కెటిఆర్ ను మరిపించేదెవరు?

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో ఐటీ మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బెంగళూరు తర్వాత దేశంలోనే హైదరాబాద్ నగరం ఐటీలో అగ్రగామిగా ఉంది. తెలంగాణా ఏర్పడ్డాక రెండు పర్యాయాలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ రెండుసార్లూ ఈ శాఖను కేటీఆరే చేపట్టారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన చెప్పుకోదగిన పాత్ర పోషించారు. కొత్త మంత్రివర్గంలో ఐటీ మంత్రి కోసం రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు జైవీర్ ఒకరైతే, ఎల్లారెడ్డినుంచి గెలిచిన మదన్ మోహన్ రావు మరొకరు.

ఐటీ రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు టీ-హబ్ స్థాపించాలన్న ఆలోచన కేటీఆర్ దే. ట్రిపుల్ ఐటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్.. అంకుర పరిశ్రమలకు ఊతమిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తోంది. మరోవైపు, గూగుల్ అమెరికా వెలుపల అతి పెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఫాక్స్ కాన్ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో తమ ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుడుతున్నాయి. 2022-23 సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరుకోవడంలో తెలంగాణా పాత్రను తక్కువ అంచనా వేయలేం.

కొత్తగా ఎన్నికైన యువకుల్లో ఐటీ మంత్రి పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలూ ఉన్న యువకులు ఇద్దరే ఇద్దరు కనిపిస్తున్నారు. వారిలో మొదటి పేరు జయవీర్. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడైన జైవీర్.. న్యూ యార్క్ యూనివర్శిటీలో బిజినెస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఐటీ రంగంపై పూర్తి అవగాహన ఉన్న జైవీర్ కు చురుకైన యువ నాయకుడిగా పేరుంది. చక్కటి వాగ్ధాటి కలిగిన నాయకుడు కూడా. ఆయన శాసనసభకు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. తాజా ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంనుంచి 56 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఐటీ మంత్రి పదవికి అన్ని అర్హతలూ ఉన్న మరొక యువ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డి నుంచి గెలిచి, తాజాగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న మదన్ మోహన్ కూడా విద్యాధికుడు. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీనుంచి ఎమ్మెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన మదన్ మోహన్, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యుఎస్‌ఎమ్ గ్రూప్ చైర్మన్ గానూ, యుఎస్‌ఎమ్ బిజినెస్ సర్వీసెస్ సిఇఓగానూ వ్యవహరిస్తున్నారు. అనలిటిక్స్ డేటా సర్వీసెస్ సంస్థలో భాగస్వామిగానూ ఉన్నారు. కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంలో సమర్ధుడైన, ఐటీ రంగంలో ప్రవేశమున్న యువకుడు ఐటీ మంత్రిగా ఉంటేనే ఇప్పటివరకూ సాధించిన అభివృద్ది ముందుకు సాగుతుంది.

కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం కొత్తవారికి మంత్రిమండలిలో ఎంతవరకూ చోటు కల్పిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే, నిబంధనల ప్రకారం తెలంగాణా మంత్రిమండలిలో గరిష్ఠంగా 18మందికి మాత్రమే చోటు కల్పించాలి. కానీ, పార్టీలో పదవులకోసం పోటీ పడుతున్న సీనియర్లు చాలామందే ఉన్నారు. వారిని కాదని పార్టీ అధిష్ఠానం యువకులకు ఐటివంటి కీలకమైన శాఖను ఎంతవరకూ అప్పగిస్తుందో వేచి చూడాల్సిందే. ఒకవేళ సీనియర్లకే ఇవ్వాలని నిర్ణయిస్తే మాత్రం దుద్దిళ్ల శ్రీధరబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలలో ఒకరిని ఐటీ మంత్రి పదవి వరించే అవకాశాలున్నాయి. శ్రీధరబాబుకు ఐటీ రంగంలో ప్రవేశం లేకపోయినా విద్యాధికుడు. నిజాం కాలేజీనుంచి డిగ్రీ, ఢిల్లీ యూనివర్శిటీనుంచి న్యాయవాద పట్టా తీసుకున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. వైఎస్ హయాంలో ఐటీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News