సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై మంత్రి కెటిఆర్
వైద్య శాఖ సలహా మేరకే లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూపై నిర్ణయం
రాష్ట్రానికి సేవతోనే నాకు సంతోషం
యుపిలో ఎస్‌పికే సానుకూలం
అక్కడ ప్రచారంపై సంప్రదింపుల తర్వాతే నిర్ణయం ప్రకటన
420 మోసగాళ్లతో నేను చర్చకు వెళ్లదలచుకోలేదు
ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి చర్చించుకోవచ్చు
ఏప్రిల్ నెలాఖరుకు రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం
కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం
‘ఆస్క్ యువర్ కెటిఆర్’లో నెటిజన్ల ప్రశ్నలకు కెటిఆర్ సమాధానాలు
ఇదేంటీ.. ఎక్కడుంది?
పోలీసు కమాండ్ కంట్రోల్ భవనం చిత్రాన్ని పోస్టు చేస్తూ నెటిజన్లకు కెటిఆర్ ప్రశ్న
మన తెలంగాణ/హైదరాబాద్: భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో సిఎం కెసిఆర్ ప్రవేశంపై మంత్రి కెటిఆర్ ఆచితూచి స్పందించారు. గురువారం ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ యువర్ కెటిఆర్’ కార్యక్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు “భవిష్యత్తు రాజకీయాల్లో ఏం జరగనుందో ఎవరికి ఎలా తెలుస్తుంది” అని సమాధానం ఇచ్చారు. ఆస్క్ యువర్ కెటిఆర్ కార్యక్రమంలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా వారు అడిగిన ప్రశ్నలకు కెటిఆర్ సమాధానలిచ్చారు. రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సినిమా, క్రీడల వంటి అనేక అంశాలపై ఆయన స్పందించారు. ఇందులో భాగంగా గాట్ల సతీష్ అనే నెటిజన్… భవిష్యత్తులో కెసిఆర్ పాత్ర జాతీయ స్థాయిలోఎలా ఉండబోతోందా? అని ప్రశ్నించారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా కెసిఆర్ సేవలు జాతీయ స్థాయి లో విస్తరించే అవకాశముందా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ స్పందిస్తూ…. భవిష్యత్తు అనేది మన చేతిలో ఉండదన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడం కూడా అసాధ్యమన్నారు.
రాష్ట్రానికి సేవ చేయడమే
రాష్ట్రానికి సేవ చేయడంలోనే సంతోషంగా ఉందని కెటిఆర్ అన్నారు. కేంద్ర ఐటి మంత్రిగా చూడాలని ఉంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా…. సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉన్నట్టు కెటిఆర్ సమాధానమిచ్చారు. ప్రేమ పూర్వకమైన రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమన్నారు. కాగా ప్రతిష్టాత్మక దేవరకొండ కోట సంరక్షణ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో మాట్లాడుతానన్నారు.
యుపిలో ఎస్‌పిదే గెలుపు
ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తుం టే…ఈ సారి సమాజ్‌వాది పార్టీ గెలుపు పవనాలు చాలా బలంగా వీస్తున్నట్లు కనిపిస్తున్నాయని కెటిఆర్ అన్నారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ మాట్లాడుతూ, గత రెండు మూడు రోజులుగా ముగ్గురు మంత్రులు, పలువురు శాసనసభ్యులు బిజెపికి రాజీనామాలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బిజెపి మంత్రులకే ఆ పార్టీ గెలుస్తున్నందన్న నమ్మకం లేకనే బయటకు వస్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే మా త్రం ఎస్‌పిదే విజయం ఖాయంగా కనిపిస్తోందన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఆ రా ష్ట్రంలో ప్రచారం చేసే అంశం పైన సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని కెటిఆర్ తెలిపారు.
బిజెపి మోసాలను అర్థం చేసుకుంటున్నారు
రాష్ట్రంలో బిజెపి చేస్తున్న అసత్య, ద్వేష ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేంత విజ్ఞులని కెటిఆర్ అన్నారు. రాష్ట్రం కోసం ఎవరు పని చేస్తున్నారో వారికి తెలుసని అన్నారు. బిజెపిని రాష్ట్రంలో కట్టడి చేసేందుకు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నకు సమాధానంగా….తాము ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రానికి శాంతి, అభివృద్ధి, సుస్థిరత కావాలని అన్నారు. కేంద్రంలో రెండు సార్లు బిజెపి అధికారంలోకి వచ్చినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోవడంతో, దాని గురించి మాట్లాడేందుకు ఏలాంటి అవకాశం లేకపోవడం వల్లనే దేశవ్యాప్తంగా మతాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ ముం దుకు వెళుతోందన్నారు. ప్రతి అకౌంట్‌లో రూ. 15 లక్ష లు వేస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఈ శతాబ్దపు జుమ్లా అని కెటిఆర్ అన్నారు.
మూర్ఖుల ప్రచారాన్ని పట్టించుకోవద్దు
ఐటి రంగంలో హైదరాబాద్ కంటే పూణే నగరం మంచి అభివృద్ధిని కనబరుస్తున్నదన్న బిజెపి ఎంపిల అసత్య పూరిత వ్యాఖ్యలపైన కెటిఆర్ స్పందించారు.మూర్ఖులు చేసే ప్రచారాన్ని వదిలి వేయడమే మంచిదన్నారు. హైదరాబాద్ నగర పేరుని భాగ్యనగరంగా మారుస్తామంటున్న బిజెపి మాటలను ఒక సిల్లీ పొలిటికల్ స్టంట్ గా ఆయన అభివర్ణించారు.
420 వంటి మోసగాళ్లతో చర్చకు దిగలేను
తనతో చర్చకు రావాలని అంటున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చకు వెళ్తారా? అని అడగగా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ముందుగా ఎంఎల్‌ఎ స్టీఫెన్ సన్‌తో చర్చ చేయాలని సూచించారు. తాను మాత్రం నేరస్తులు, 420 వంటి మోసగాళ్లతో చర్చకు దిగలేనన్నారు.
ఏప్రిల్‌లో ఇంటింటికీ ఇంటర్నెట్..
ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం అంతానికి ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమంలో తొలి దశ పూర్తవుతుందన్నారు. పూర్ ఇంటర్నెట్ కనెక్షన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌లో పాఠాలు వినడం చాలా కష్టంగా మారిందని ఒక నెటిజన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పల్లెలకు ఫైబర్ ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారని అడగారు. దీనికి కెటిఆర్ స్పంది స్తూ కరోనా కారణంగా అనేక సమస్యలు తలెత్తాయన్నారు. వాటిల్లో ఇంటర్నెట్ సమస్య కూడా ఒకటన్నారు. అయితే సాధ్యమైనంత త్వరగానే ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికి ఇంటర్నెట్‌ను ఇవ్వాలనే కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఫైబర్ గ్రిడ్ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు 589 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించనున్నారు. అయితే ఈ కార్యక్రమం విడతల వారీ గా చేపడతామన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రస్తుతం సబ్సిడీ ఉందన్నారు. రానున్న రోజు ల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ లకు సంబంధించి టిఎస్ రెడ్కో తో కలిసి అనేక ప్రైవేట్ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించయని తెలిపారు.
అక్రమంగా రోడ్ల మూసివేతపై.. పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తాం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అక్రమంగా రోడ్ల ను మూసివేయడం పైన రానున్న పార్లమెంట్ సమావేశా ల్లో , ఇతర జాతీయ వేదికలపైన ఈ అంశాన్ని లేవనెత్తుతామని కెటిఆర్ అన్నారు. నార్త్ హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సుచిత్ర జంక్షన్ ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. బహదూర్ పుర ఫ్లైఓవర్ పనులు త్వరలోనే పూర్తి అవుతాయని కెటిఆర్ తెలిపారు.
లాక్‌డౌన్, రాత్రి కర్ఫూపై త్వరలో నిర్ణయం
రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉంటుందా? అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు….వైద్యారోగ్యశాఖ సలహా మేరకు తగు నిర్ణయముంటుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేసారు. ప్రస్తుతం దేశవాప్తంగా మళ్లీ కరోనా కేసులు పె రుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందన్నారు. దీనిపైఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చే నివేదిక, సూచన, సలహాల మేరకు ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు.