Sunday, October 6, 2024

తెలంగాణలో ఐటి పరుగులు

- Advertisement -
- Advertisement -

ఏటా పెరుగుతున్న ఎగుమతులు
దేశానికి ఐటీ హబ్‌గా మారుతున్న తెలంగాణ
మొత్తం ఐటీ ఉద్యోగాల్లో 44 శాతం వాటా తెలంగాణదే
ఐటీ రంగం పెట్టుబడులకు కేంద్రంగా పేరు ప్రఖ్యాతులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఐటి పరుగులు తీస్తోంది. ఐటికి కేరాఫ్‌గా తెలంగాణ మారుతోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుండడంతో ఐటి ఎగుమతులు పెరుగుతున్నాయి. గత పదేళ్లలో ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు, ఉద్యోగాలు మూడు రెట్లు పెరిగాయి. ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ-గ్రేడ్ ఆఫీసు స్పేస్ లీజింగ్‌లోనూ బెంగళూరును హైదరాబాద్ దాటిపోయింది. దేశంలోని మొత్తం ఐటి ఉద్యోగాల్లో తెలంగాణ 44 శాతం వాటా కలిగి ఉంది. పదేళ్లలో తెలంగాణలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్లలో ఐటి ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయి.

తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పదేళ్లలో ఐటీ రంగంలో మూడు రెట్ల మేర ఉద్యోగాలు పెరిగి 9 లక్షలకు చేరడంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారుతోంది. ఏటా లక్షలాదిమంది ఈ నగరానికి ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు. 2016లో తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీ, డేటా సెంటర్స్ పాలసీ (2016- దేశంలోనే మొదటిది) తో పాటు 2017లో తీసుకువచ్చిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పాలసీ, బ్లాక్ చెయిన్ పాలసీ, డ్రోన్ పాలసీ (2019 – దేశంలోనే మొదటిది) ద్వారా కంపెనీల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇచ్చినట్లయింది. టాప్-5 గ్లోబల్ టెక్ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2014- నుంచి 2015 వరకు 3,71,774, 2015 నుంచి -2016 వరకు 4,07,385, 2016 నుంచి -2017 వరకు 4,31,891, 2017- నుంచి 18 వరకు 4,75,308, 2018 నుంచి -19 వరకు 5,43,033, 2019 నుంచి 2020 వరకు 5,82,126, 2020- నుంచి 2021వరకు 6,28,615, 21 నుంచి -2022 వరకు 7,78,121, 2022 నుంచి 2023 వరకు 9,05,715 ఉద్యోగాలు లభించాయి.

తెలంగాణ ఏర్పాటు సమయంలో 3 స్టార్టప్ ఇంక్యుబేటర్లు, 200 స్టార్టప్ కంపెనీలు మాత్రమే ఉండేవి. 2023 నాటికి అవి 77 ఇంక్యుబేటర్లు, 7 వేలకు పైగా స్టార్టప్‌లకు పెరిగాయి. 2014లో – 3,71,774 గా ఉన్న ఉద్యోగాలు 2023 నాటికి – 9,05,715 కి చేరాయి. దీంతో ఉదోగ్యాల్లో పెరుగుదల – 143 శాతం గా నమోదైంది. ఐటీ అభివృద్ధితో గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ సత్తా చాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ నివేదికగా చెప్పుకొనే జీఎస్‌ఈఆర్-2022లో రాష్ట్రానికి స్థానం దక్కడం విశేషం. గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ టాప్-10 జాబితాలో స్థానాన్ని సంపాదించింది. ఏషియన్ ఎకో సిస్టం ఇన్ అఫర్డబుల్ టాలెంట్ జాబితాలోనూ టాప్‌ప్లేస్‌లో నిలిచింది.

ఐటీ రంగం పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ…

తెలంగాణలో ఐటీ ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఐటీ రంగం పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు వస్తున్నాయి. ఐటీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతీ ఐదేండ్లకు ఒకసారి ఐటీ పాలసీని కొత్తగా రూపొందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 2016, 2021లో మెగా పాలసీలను రూపొందించి విజయవంతంగా అమలు చేసింది. అంతేకాకుండా 2016లో తీసుకువచ్చిన పాలసీలో సబ్ క్యాటగిరీల పేరిట ఐటీలో తీసుకొచ్చిన విప్లవాత్మక నూతన విధానాలు ఓ చరిత్రనే సృష్టించాయి. టీహబ్, టీహబ్ 2.0, టీవరక్స్, వీహబ్, టీఎస్‌ఐటీ, రిచ్ వంటి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడమే కాదు.. వాటిని సమర్థవంతంగా నిర్వహించింది. 2014- నుంచి 15 వరకు 66,276 కోట్లు, 2015 నుంచి -16 వరకు 75,070 కోట్లు, 2016- నుంచి 17 వరకు 85,470 కోట్లు, 2017- నుంచి 18 వరకు 93,442 కోట్లు, 2018-నుంచి 19 వరకు 1,09,219 కోట్లు, 2019 నుంచి -20 వరకు 1,28,807 కోట్లు, 2020- నుంచి 21 వరకు 1,45,552 కోట్లు, 2021 నుంచి -22 వరకు 1,83,569 కోట్లు, 2022- నుంచి 23 వరకు 2,41,275 కోట్ల ఎగుమతులు తెలంగాణ నుంచి జరిగాయి.

ఐటీకి కేరాఫ్‌గా మారుతున్న హైదరాబాద్…

హైదరాబాద్‌లో కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ విద్యుత్తు కోతలతో ఐటీ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలిగేది. దీంతో బెంగళూరు వంటి నగరాలకు ఐటీ కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంటనే నిరంతరాయ కరెంటు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. కొత్త స్టార్టప్‌ల ఏర్పాటుకు నైపుణ్య శిక్షణనిచ్చే ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసింది. ప్రోత్సాహకాలు అందించింది.

అలా ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ విధానాల వల్ల ఐటీ పరిశ్రమ పరుగులు పెట్టింది. దేశానికి ఐటీ హబ్‌గా తెలంగాణ మారింది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి 20కి పైగా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఐటీ అభివృద్ధితో ఆ రంగంపై ఆధారపడ్డ ఇతర రంగాలూ ఎంతో లాభపడ్డాయి. ఒక్క ఐటీ ఉద్యోగం సృష్టితో పరోక్షంగా మరో నాలుగు ఉద్యోగాలు వస్తాయని అంటారు. తెలంగాణలో ఐటీ వృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వినోదం, రవాణా, లాజిస్టిక్ రంగాలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News