Sunday, December 22, 2024

విపక్షాలపై ‘ఐ’టీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పన్ను మదింపు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటలకే రూ. 1800 కోట్లకు పైబడిన పన్ను బకాలయు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పన్ను శాఖ(ఐటి) శుక్రవారం నోటీసులు జారీచేసింది. 2017-18, 2020–21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జారీ చేసిన ఈ నోటీసులలో జరిమానా, వడ్డీ కూడా కలి పి ఉన్నాయి. ఐటి శాఖ నుంచి రూ. 1823.08 కోట్ల బకాయిలకు సంబంధించిన నోటీసులు అందాయని కాంగ్రెస్ ధ్రువీకరించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బిజెపి పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మకన్ శుక్రవారం పార్టీ ప్రధా న కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి ఐటి చట్టాల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. అటువంటి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన బిజెపి నుంచి రూ. 4,600 కోట్ల కు పైగా పన్ను వసూళ్లను ఐటి శాఖ చేయాల్సి ఉం టుందని తెలిపారు.

ఎన్నికల బాండ్ల కుంభకోణం ద్వారా బిజెపి రూ. 8,200 కోట్లను వసూలు చేసిందని, ఇందుకోసం ప్రీపెయిడ్, పోస్టు పెయి డ్, పోస్టు రెయిడ్ ముడుపులు, సూట్ కేసు కంపెనీల మార్గాన్ని బిజెపి ఎంచుకుందని జైరాం రమేష్ ఆరోపించారు. మరోపక్క బిజెపి పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందనిఆయన ఆరోపించారు.కాంగ్రెస్‌ను ఆర్థికంగా కూల్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాని తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సాగిస్తున్న ప్రచారం కొనసాగుతుందని, తమ పార్టీ గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకు వెళతామని ఆయన తెలిపారు. ఈ నోటీసులకు తాము బెదిరేది లేదని, తాము మరింత ఉధృతంగా ఈ ఎన్నికల్లో పోరాడతామని జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఐటి శాఖను బిజెపి అనుబంధ సంస్థగా మకన్ అభివర్ణించారు. కాంగ్రెస్‌తోపాటు ఇతర భావసారూప్య పార్టీలను లక్షంగా చేసుకుని ఐటి శాఖ వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. నిరాధార కారణాలపై పాత రిటర్న్‌ను పునఃప్రారంభించిన ఐటి శాఖ కాంగ్రెస్‌పై కుట్రపూరితంగా దుష్ప్రచారాన్ని చేపట్టిందని ఆయన ఆరోపించారు. ఐటి శాఖ జారీచేసిన నోటీసులపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మకన్ తెలిపారు.

బిజెపికి చెందిన రూ. 40 కోట్ల మేరకు లెక్కల్లో చూపని దబ్బుపై ఐటి శాఖ నుంచి చర్యను కోరుతూ తాము కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్న వివరాల ప్రకారం 2017-18 సంవత్సరంలో బిజెపికి 1,297 మంది రూ. 42 కోట్లు విరాళంగా ఇచ్చారని, అయితే వారి పేర్లు, చిరునామాలు కనపడడం లేదని మకన్ తెలిపారు. రూ. 14 లక్షల నగదు డిపాజిట్‌పై కాంగ్రెస్ పార్టీ బ్యాంకు కాతాలను ఐటి శాఖ స్తంభింపచేసిందని, కాని బిజెపి పాల్పడిన 42 కోట్ల ఉల్లంఘన ఐటి శాఖకు కనిపించలేదని ఆయన విమర్శించారు. ఐటి నిబంధనల ఉల్లంఘనకు బిజెపి పాల్పడిందని, ఆ పార్టీకి రూ. 4,600 కోట్ల జరిమానా విధించాల్సిందేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్ వర్తించిన నిబంధనలు బిజెపికి కూడా వర్తిస్తాయని, ఇవే నిబంధనలపై బిజెపికి కూడా ఐటి శాఖ నోటీసులు జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా..నాలుగేళ్ల కాలానికి పన్ను మదింపు ప్రక్రియను ఐటి శాఖ తిరిగి చేపట్టడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోరాన్న తమ ఇదివరకటి నిర్ణయం మేరకు పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.

సిపిఐకి ఐటి నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీచేసిన రోజే ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన సిపిఐకి కూడా ఆదాయం పన్ను శాఖ(ఐటి) శుక్రవారం నోటీసులు జారీచేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐటి రిటర్న్‌లు దాఖలు చేస్తున్న సమయంలో పాత పాన్ కార్డునే ఉపయోగిస్తున్నందుకు రూ. 11 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ సిపిఐకి ఐఇటి శాఖ నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఐటి అధికారులు జారీచేసిన నోటీసులను సవాలు చేసేందుకు న్యాయవాదులను సిపిఐ నాయకత్వం సంప్రదిస్తోందని వర్గాలు తెలిపాయి. పాత పాన్ కార్డు వాడకంలో జరిగిన పన్ను వ్యత్యాసాలకు జరిమానాలు, వడ్డీతోసహా కలిపి బకాయిల కింద రూ. 11 కోట్లు చెల్లించాలని ఐటి శాఖ సిపిఐకి నోటీసులు జారీచేసిందని వారు చెప్పారు. ఈ విషయమై న్యాయ సలహా కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు సిపిఐ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా గడచిన 72 గంటల్లో తనకు ఐటి శాఖ నుంచి 11 నోటీసులు అందిచనట్లు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సాకేత్ గోఖలే శుక్రవారం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాన్ని ఆర్థికంగా క్రుంగదీయడానికి బిజెపి పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

నేడు, రేపు కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆదాయం పన్ను శాఖ(ఐటి) కాంగ్రెస్‌కు రూ. 1,800 మేర పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేయడాన్ని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా, పన్ను ఉగ్రవాదంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. దీనికి వ్యతిరేకంగా మార్చి 30, 31 తేదీలలో(శనివారం, ఆదివారం) దేశవ్యాప్తంగా నిరసలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఐటి శాఖ నుంచి తమకు తాజా నోటీసులు అందాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు. దీనికి నిరనసగా దేశవ్యాప్తంగా శనివారం, ఆదివారం అన్ని రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాలలో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి)లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొనాలని ఆయన కోరారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి బిజెపి ఒక పథకం ప్రకారం పనిచేస్తోందని పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నాయకులు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు రాసిన లేఖలో వేణుగోపాల్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు, అన్ని జిల్లాలలో జిల్లా కాంగ్రెస్ కమిటీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News