నాకూ ఐటి నోటీసులు వచ్చాయి
డికె శివకుమార్ వెల్లడి
బెంగళూరు: తన పార్టీకి జారీ చేసినట్లుగానే ఇదివరకే పరిష్కారమైన వ్యవహారంలో తనకు కూడా ఆదాయం పన్ను(ఐటి) శాఖ నుంచి నోటీసు జారీ అయిందని కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డికె శివకుమార్ శనివారం వెల్లడించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలనే లక్షంగా చేసుకుని బిజెపి ఈ చర్యలకు పాల్పడుతోందని, దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌కు, ఇండియా కూటమికి బిజెపి భయపడుతోందని అర్థమవుతోందని డికె వ్యాఖ్యానించారు. ఐటి నోటీసులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని బిజెపి చూస్తోందని, ఎన్నికల్లో ఓడిపోతామని వారికి అర్థమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం ఐటి శాఖ నుంచి రూ. 1,823.08 కోట్ల చెల్లింపులకు సంబంధించి ఐటి శాఖ నోటీసులు జారీచేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, అజయ్ మాకెన్ లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఆర్థికంగ దెబ్బతీసే పన్ను ఉగ్రవాదానికి బిజెపి పాల్పడుతోందని వారు ఆరోపించారు.