ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాద్, ఖమ్మంలో ఐటి అధికారులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్ లోని నందగిరిహిల్స్ నివాసంతోపాటు ఖమ్మంలోని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు పొంగులేటి నివాసంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతోపాటు సిబ్బంది ముబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు చేస్తున్నారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్న క్రమంలో ఐటీ దాడులు జరుగుతుండడంతో.. ఇది కేసీఆర్ చేయిస్తున్న పనేనని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇక, నిన్న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. నివాసంలో డబ్బులు ఉన్నాయని, సీ విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి శ్రీలత, సిఐ రాజిరెడ్డి వారి సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. అనంతరం అధికారులు విలేకరులతో మాట్లాడారు. యాప్‌లో అందిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించగా ఎటువంటి నగదు లభ్యం కాలేదన్నారు. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.