న్యూఢిల్లీ: బినామీ ఆస్తుల చట్టం నమోదైన కేసులో దర్యాప్తు జరుపుతున్న ఆదాయం పన్ను శాఖ అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నివాసానికి వెళ్లారు. ఐటి శాఖ ఆఫీసుకు వచ్చి దర్యాప్తులో పాల్గొనాలని అధికారులు వాద్రాను కోరగా కొవిడ్-19 ఆంక్షల కారణంగా తాను అక్కడకు రాలేనని ఆయన చెప్పడంతో ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్ ప్రాంతంలోని ఆయన నివాసానికి వెళ్లారని అధికార వర్గాల వారు తెలిపారు. బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్ట నిబంధనల కింద వాద్రా వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఐటి అధికారుల బృందం ఆయన ఇంటికి వెళ్లిందని వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా లెక్కల్లో చూపని ఆస్తులు బ్రిటన్‌లో కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఐటి శాఖ దర్యాప్తు చేస్తోంది. ఇవే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాద్రాపై దర్యాప్తు చేస్తోంది. అయితే, తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని వాద్రా గతంలోనే స్పష్టం చేయగా దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
IT officials visits Vadra’s home on benami assets case