Saturday, November 23, 2024

గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపి ధీరజ్ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై గత మూడు రోజులుగా ఐటి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఒడిశా, జార్ఖండ్‌లలోజరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటివరకు రూ.290 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. శనివారం కూడా ఐటి అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో రాంచీలోని ధీరజ్ సాహుకు చెందిన ఆఫీసులో మరో మూడు బ్యాగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఒడిశాలో జరుగుతున్న దాడుల్లో మద్యం ఫ్యాక్టరీలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న బంటీ సాహు అనే వ్యక్తి నివాసంలో దాదాపు 19 బ్యాగుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన బ్యాగుల్లో మొత్తం రూ.20 కోట్లకు పైగానే నగదు ఉన్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి అధికారులు మూడు డజన్ల కౌంటింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నారు.

ఇప్పటివరకు పట్టుబడిన మొత్తం దాదాపు రూ.300 కోట్ల దాకా ఉండవచ్చని సమాచారం. మూడు ప్రాంతాల్లోని ఏడు గదులు, తొమ్మిది లాకర్లను ఇంకా చెక్ చేయాల్సి ఉందని ఐటి అధికారులు చెప్తున్నారు. ఈ లాకర్లలో మరింత నగదు, బంగారు అభరణాలు వంటివి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటి అధికారులు మొదట ఈ నెల 6వ తేదీన డిస్టిలరీలపై దాడులు మొదలు పెట్టారు. ఆ తర్వాత బల్దియో సాహు గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడ 156 బ్యాగుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని టిట్లాఘర్, సంబల్‌పూర్,సుందర్‌గఢ్, భువనేశ్వర్, జార్ఖండ్‌లోని మరికొన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఐటి అధికారులు తెలిపారు. రాయగడ, రూర్కెలాలోని కొందరు మద్యం వ్యాపారులకు సంబంధించిన ఆస్తులపై కూడా దాడులు జరిగాయి. బహుశా దేశంలో ఐటి దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే మొదటి సారి కావచ్చని ఐటి అధికారులు అంటున్నారు.

జనం నుంచి దోచుకున్న సొమ్మును ప్రతిపైసా కూడా వారికి తిరిగి చెల్లించేలా చూస్తాం. ఇది మోడీ గ్యారంటీ అని అంటూ ప్రధాని మోడీ శుక్రవారం ‘ఎక్స్’లో ఉంచిన ఒక ట్వీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, అలాగే అధికార బిజూ జనతాదళ్ దీనిపై వివరణ ఇవ్వాలని ఒడిశా బిజెపి విభాగం డిమాండ్ చేసింది. ఒడిశాలో విజిలెన్స్, ఆర్థిక నేరాల విభాగం, ఎక్సైజ్ విభాగం ఏం చేస్తున్నాయని బిజెపి అధికార ప్రతినిధి మనోజ్ మహాపాత్ర ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News