Thursday, December 19, 2024

తెలంగాణలో ఐటి దాడుల కలకలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బిఆర్‌ఎస్ నేత, భువనగిరి ఎంఎల్‌ఎ శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటి అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతోపాటు బిఆర్‌ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటి సోదాలు నిర్వహిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపి, ఎంఎల్‌ఎల నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీళ్లిద్దరి కంపెనీల్లో ఉదయం నుంచి ఐటి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ రాజకీయం ఇప్పుడు మరోసారి హీట్ ఎక్కింది. ఈ టైంలో సడెన్‌గా జరిగిన ఐటీ రైడ్స్ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అధికార పార్టీ బిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆఫీస్‌లు, వారి బంధువుల, సహచరుల నివాసాలపై కూడా ఐటి కన్నేసింది. బుధవారం ఉదయం నుంచి మూకుమ్మడిగా సైలెంట్‌గా అధికారులు అటాక్ చేశారు. బిఆర్‌ఎస్‌కు చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో తనిఖీలు చేస్తున్నారు.

ప్రస్తుతం ముగ్గురు ప్రజాపతినిధులపై జరుగుతున్న ఐటి రైడ్స్ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇంట్లో బుధవారం వేకువజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపి ఉంటున్నారు. ఆయన ఇంటితోపాటు ఆఫీసుల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పైళ్ల శేఖర్ రెడ్డి యాదాద్రి జిల్లాలో భువనగిరి ఎంఎల్‌ఎగా ఉన్నారు. ఆయన నివాసం, కంపెనీల్లో కూడా ఐటి శాఖ తనిఖీలు నిర్వహించింది. భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని ఆఫీస్, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లతోపాటు మొత్తం 12 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే నివాసాలు, బంధువుల ఇళ్లు, ఆఫీస్‌లపై సోదాల కోసమే 30 టీంలు పని చేస్తున్నాయి. అయితే ఎంఎల్‌ఎ శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

అనేక కంపెనీలలో బినామీగా ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి ఉన్నాడని, 15 కంపెనీలలో పెట్టుబడి దారుడుగా ఉన్నారని సమాచారం. మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్‌కర్నూల్ ఎంఎల్‌ఎగా ఉన్నారు. ఆయనకు చెందిన షాపింగ్ మాల్‌పై ఐటి శాఖ గురిపెట్టింది. కెపిహెచ్‌బి కాలనీలోని జెసి బ్రదర్స్‌లో ఐటిశాఖ దాడులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తోంది. కాగా ఈ ఐటి సోదాలు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా బిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులపై ఐటి, ఇడి సోదాలు నిర్వహించింది. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్టుగా దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. మంత్రి గంగుల కమలాకర్, బిఆర్‌ఎస్ ఎంపి రవిచంద్ర నివాసాలు, కార్యాలయాల్లో ఇడి సోదాలు నిర్వహించిన విషయం విదితమే. బుధవారం బిఆర్‌ఎస్‌కు చెందిన ఎంఎల్‌ఎలు, ఎంపి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఐటి, ఇడి అధికారుల సోదాలకు సంబంధించి తమకు సంబంధం లేదని బిజెపి నేతలు చెబుతున్నారు.

ఐటి దాడులపై బిఆర్‌ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందన
బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ఐటి సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ తనకు, ఈ ఐటి సోదాలకు సంబంధం లేదని చెప్పారు. కొందరు ఇతర ఎంఎల్ ఎలతో కలిసి తాను వ్యాపారాలు నిర్వహిస్తున్నాననే ఆరోపణ కరెక్ట్ కాదని అన్నారు. ఐటి అధికారులు తనకు జారీ చేసిన నోటీసులపై సమా ధానం ఇస్తానని చెప్పారు. 1986 నుంచి తాను బిజినెస్ చేస్తున్నానని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎంతో నీతివంతంగా వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపారు. ఎప్పుడూ లేని ఐటి దాడులను ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తనపై బురద చల్లేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టుందని విమర్శించారు. తన ఆస్తులకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ఐటి అధికారులకు చూపిస్తానని చెప్పారు. విదేశాల్లో తాను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News