Sunday, December 22, 2024

మళ్లీ ఐటి దాడుల కలకలం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో సోదాలు

మన తెలంగాణ/హైదరాబాద్/మంచిర్యాల/ ఆసిఫాబాద్/ తాండూరు : అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో మరోమారు ఐటి దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం విదితమే. ఇక తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాల్లో అధికారులు తనిఖీలు జరిపారు. బేగంపేటలోని వివేక్ కార్యాలయంలనూ సోదాలు చేశారు. అయితే సోమాజిగూడలోని వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. వివేక్ ఇంట్లో ఐటి అధికారులు నాలుగున్నర గంటల పాటు సోదాలు నిర్వహించారు. బ్యాంక్ ఖాతాలో రెండ్రోజుల క్రితం చేసిన నగదు బదిలీకి సంబంధించిన పత్రాలు పరిశీలించినట్లు తెలుస్తోంది.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఏకకాలంలో వ్యాపారస్థుల ఇళ్లల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యాపారుల ఇళ్లల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఐటి సోదాలు కొనసాగాయి. ఆసిఫాబాద్‌లోని రితిక్ జివానీ ఇంట్లో స్థానిక పోలీసులతో కలిసి వారి బ్యాంకుకు సంబంధించిన వ్యాపార లావాదేవీలను పరిశీలించారు. అలాగే, కాగజ్‌నగర్‌లోని మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ ఇంట్లో మంగళవారం ఉదయం 6 గంటలకే స్థానిక పోలీసులతో కలిసి ఐటి అధికారులు వారి లావాదేవీలను పరిశీలించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆసిఫాబాద్‌లోని రితిక్ జివానీ ఇంట్లో కొంత నగదు దొరికినట్లు సమాచారం. ఈ నగదుపై అఇకారులు ఆరా తీశారు. అలాగే, వారి కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలను కూడా పరిశీలించారు. ఐటి అధికారులు జిల్లాకు సుమారుగా 20 వాహనాలలో వచ్చినట్టు సమాచారం. ఐటి అధికారులు చేస్తున్న దాడులతో ఆసిఫాబాద్ జిల్లాలోని బడా వ్యాపారస్థులు, కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం జమ్మికుంటకు చెందిన ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్‌తో పాటు మరో కాటన్ మిల్లు యజమానులు ముక్క నారాయణ, ముక్క శివన్న ఇళ్లల్లో సోదాలు చేశారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తాండూరు మండలంలోని రేపల్లేవాడ సమీపంలోని జిన్నింగ్ మిల్లులో మంగళవారం ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఐటీ అధికారులు స్థానిక పోలీసు బందోబస్తుతో ఈ తనిఖీలు చేపట్టారు.

మాజీ ఎంపీ వివేక్ మొన్నటివరకు బిజెపిలో ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటివరకు జరగని దాడులు పార్టీ మారిన తరువాతే జరగుతుండడంతో కావాలనే చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయ. హుజురాబాద్, మునుగోడు ఎన్నికలకు వందల కోట్లు ఇచ్చింది వివేక్ కంపనీనే అని వినవస్తోంది. మంచిర్యాలలో 8 కోట్లు పట్టుకున్నవి వివేక్ సొమ్మే అని సమాచారం. ఈ డబ్బుల విషయంలోనే ఈటలకు – వివేక్ కి చెడిందని తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ మారగానే టార్గెట్ చేశారని అంటున్నారు.
8 కోట్ల రూపాయల చుట్టే విచారణ – మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో తనిఖీలు అందుకేనా?
ఈనెల 15న.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు 50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్ రామంతాపూర్‌లో పట్టుబడ్డారు. ఇక.. వివేక్‌కు సంబంధించిన కంపెనీ నుంచి 8కోట్ల రూపాయల నగదు బదిలీపై కూడా కేసు నమోదు చేసిన ఇడి తనిఖీలు చేపడుతోంది. ఆన్‌లైన్ లావాదేవీలు భారీగా జరిగినట్టు గుర్తించింది. హైదరాబాద్‌లో 8కోట్ల రూపాయలను ఆర్‌టిజిఎస్ ద్వారా బదిలీ చేసినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బిఆర్‌ఎస్ నేతలు ఇసికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, బేగంపేట్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన రూ.8 కోట్ల రూపాయలను సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇడి, ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి వివేక్ ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 13న ఉదయం 10గంటల 57నిమిషాలకు బేగంపేటలోని హెచ్‌డిఎఫ్‌సి బ్రాంచ్‌లో ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఒక ఖాతా నుంచి బషీర్‌బాగ్‌లోని ఐడిబిఐ బ్యాంకు శాఖలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలోకి రూ.8 కోట్ల రూపాయల నగదు బదిలీ అయినట్టు ఇడి అధికారులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సోదాలు నిర్వహించారు.

వివేక్ వెంకటస్వామి సూటు బూటు సూట్‌కేసులతో వచ్చి ఇతర పార్టీ నేతలను కొనుగోలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేత బాల్కసుమన్ ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. బిఆర్‌ఎస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. వివేక్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు డబ్బులతో పట్టుబడటం కూడా కలకలం రేపింది. దీంతో ఈడి, ఐటీ శాఖలకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఇడి, ఐటి అధికారులు రంగంలోకి దిగి దాడులు చేస్తున్నట్టు సమాచారం.

వివేక్ ఇంటి వద్ద కార్యకర్తలు, అనుచరుల ఆందోళన
వివేక్ వెంకస్వామి ఇళ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులను ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. చెన్నూలులోని వివేక్ ఇంటి దగ్గరకు భారీగా చేరుకున్న కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చేస్తున్నారు. ఇందంతా రాజకీయ కుట్ర అని ఇందులో బిఆర్‌ఎస్ హస్తం ఉందని వివేక అనుచరులను ఆరోపిస్తున్నారు. ఇటీవలే బీజేపీ నుంచి వివేక్ కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

రేవంత్ ఖండన
మరోవైపు కాంగ్రెస్ నేతలపై ఐటి సోదాలను పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు దేనికి సంకేతమని ప్రశ్నించాారు. బిఆర్‌ఎస్, బిజెపి నేతల ఇండ్లపై ఐటి సోదాలు ఎందుకు జరగడం లేదు? అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైందని, ఆ సునామీని ఆపడానికి చేస్తున్న కుతంత్రమే ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల పొంగులేటి ఇంటిపైనా ఐటి దాడులు…
ఇటీవల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే ఐటీ అధికారులు తనిఖీ చేసేందుకు ఆయన నివాసా నికి వెళ్లడం గమనార్హం.ఈ నెల 9వ తేదీన ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డినివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి పొంగులేటితో సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ఉన్న పొంగులేటి నివాసం, రాఘవ కన్‌స్ట్రక్షన్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆరోజున నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. తనపై ఆదాయపన్ను శాఖ దాడులపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. బిఆర్‌ఎస్, బిజెపి కలిసి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బిజెపిలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని, ఆ పార్టీలోకి రాలేదని, అదేవిధంగా హస్తం పార్టీ గ్రాఫ్ పెరిగిందని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్‌ని విమర్శిస్తే ఐటీ సోదాలు జరుగుతాయని తనకు తెలుసని, తాను ఉహించినట్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. బిజెపి ఎజెండా ఒక్కటేనని, తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదని ప్రయత్నిస్తున్నారని పొంగులేటి విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News