రాంచి: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన ఒడిశాలోని డిస్టిలరీ కంపెనీపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న నగదు రూ.353.5 కోట్లకు పైగా ఉండగా నేలమాళిగలో దాచి ఉండచ్చని అనుమానిస్తున్న బంగారు నగలు, నగదు కోసం అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఒకే దాడిలో లభించడం ఇదే మొదటిసారని ఐటి అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లోని రాంచి, లోహర్‌దాడాలో ఉన్న ధీరజ్ సాహు రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు నేలమాళిగలో దాచిన బంగారం, నగదు నిక్షేపాల కోసం చర్యలు చేపట్టారు. నాటు సారా అమ్మకం ద్వారా సాముకు చెందిన బౌధ్ డిస్టిలరీస్ కంఎనీ లెక్కల్లో చూపని వందల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా..కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. ప్రతిపక్షాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణ కాంగ్రెస ఎంపికి చెందిన కంపెనీపై జరిపిన ఐటి దాడులలో లభించిన ధనంతో కేవలం దుష్ప్రచారమని తేలిపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. లూటీ చేసిన అవినీతి సొమ్మును కక్కిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా తమ పార్టీ ఎంపి ధీరజ్ సాహు వ్యాపారాలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆ డబ్బు గురించి, అది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం గురించి ఆ ఎంపీనే వివరణ ఇచ్చుకుంటారని ఆ పార్టీ స్పష్టం చేసింది.