Thursday, December 19, 2024

పొంగులేటి ఆఫీసులు, ఇళ్లపై ఐటీ దాడులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం  : మాజీ ఎంపి, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ఊహించినట్లుగానే ఆయన ఆఫీసులు ఇళ్ళు, బంధువుల నివాసాలపై గురువారం ఐటి దాడులు జరిగాయి. ఏకకాలంలో హైద్రాబాద్, ఖమ్మం, నారాయణపురంలలో నివాస గృహంలో, ఆఫీస్‌లపై దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న వారిని ఎవరి బయటకు వెళ్లనివ్వలేదు. ఖమ్మంలో ఉ.5.05లకు ఒక్కసారిగా 8 వాహనాలలో వచ్చిన అధికారులు వచ్చి రాగానే అందరి వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు ఇంట్లో అన్ని రూంలు సోదా చేశారు. 15 మందికి పైగా ఐటీ అధికారులు, 10మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్‌లోని రాఘవ కన్‌స్ట్రక్షన్, మరికొన్ని వారి బంధువుల ఇళ్లపైన, పాలేరు నియోజకవర్గంలోని సాయిగణేష్ నగర్‌లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాఘవ కన్‌స్ట్రక్షన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. ఇళ్లలోనూ కార్యాలయాలలోనూ డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఎన్నికల వేళ పొంగులేటి ఇళ్లపై దాడులు చేయడం కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగమే అని ఈ సందర్భంగా మాజీ ఎంపి పొంగులేటి ఆరోపించారు. తన నామినేషన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకే ఐటీ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటిపై పోలీస్, ఈసీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
పొంగులేటి ఇంటివద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో గురువారం పొంగులేటి నామినేషన్ కార్యక్రమం ఉండటంతో ఆ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్న సమయంలోనే ఐటీ దాడులు జరగడంతో ఆయన ఒకింత ఖంగుతిన్నారు. దాడులు జరుగుతాయని ముందే భావించినప్పటికీ నామినేషన్ వేసే రోజే అధికారులు రావడంపై ఆయన ఆశ్చర్యానికి లోనయ్యారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొంగులేటి కోసం వచ్చే వాళ్ళ కూడా తెల్లవారే సరికే ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి లోపల దాడులు జరుగుతుండటంతో ఎవరినీ లోపలికి వెళ్లనివ్వలేదు. బయట వందలమంది గుమిగూడారు. పొంగులేటి ఇంటిలోపలికి వెళ్లేందుకు ఉన్న మెయిన్ గేట్ మూసి వేయడంతో అక్కడ చేరుకున్న పొంగులేటి అభిమానులు, కార్యకర్తలు గేట్ నెట్టుకొని ఇంటి లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు ఆకతాయిలు గేటును బలంగా కొట్టారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి తదితరులు కార్యకర్తలను వారించారు. పెద్ద ఎత్తున మీడియా బృందాలు అక్కడకు చేరుకున్నాయి. గుమిగూడిన కార్యకర్తలు, పొంగులేటి శీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దాదాపు ఆరు గంటలుగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పొంగులేటి నామినేషన్ వేసేందుకు ఉదయం 10 గంటల తర్వాత ఐటీ అధికారులు ఇచ్చిన అనుమతితో ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఎన్నికల సంఘం జోక్యంతో పొంగులేటిని నామినేషన్ వేసి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చి మీడియా మాట్లాడారు.

ఈడీ దాడులు చేసినా, కాంగ్రెస్ గెలుపును ఆపలేరు : పొంగులేటి

కాంగ్రెస్‌ను బలహీన పర్చాలని బిఆర్‌ఎస్, బిజెపి కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని మాజీ ఎంపి పొంగులేటి ఆరోపించారు. ఐటీ, ఈడీ దాడులతో తనను దెబ్బతీయాలని చూస్తే అది జరిగేదికాదని, అన్నిటికీ తెగించే వచ్చానని, ఎన్ని కుట్రలు పన్నినా కుతంత్రాలు చేసిన వెనక్కు తగ్గేదిలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెల్లవారుతుండగానే 15 మంది ఐటీ అధికారులు, 10 సీఆర్పీఎఫ్ సిబ్బంది 5 .05 గంటలు వచ్చారని తాను ముందుగానే లేచి బ్రెష్ చేస్తుండగా వి ఆర్ కమింగ్ ఫ్రం ఐటీ అన్నారని దాంతో తాను మంచిది అని చెప్పి వాళ్ళు అడిగిన వాటిని ఇచ్చామన్నారు. బిఆర్‌ఎస్ బిజెపిలు కలిసి ఎన్నికేసులైనా పెట్టుకోండి భయపడేది లేదన్నారు. నన్ను ఇంట్లో నుంచి కూడా బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారని. నేను ఐటీ అధికారులకు చెప్పానని ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున నామినేషన్ వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నానని, నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది వస్తారని, నన్ను వెళ్లకుండా నిర్భందిస్తే తరవాత జరిగే పరిణామాలకు నేను బాధ్యున్ని కాదని చెప్పడంతో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చారని, అయితే నామినేషన్ వేసిన తర్వాత తిరిగి రావాలని కోరారని, తాను ముందుగానే అభ్యర్థిగా ప్రచారం చేసేందుకు షెడ్యూల్ నిర్ణయించుకున్నానని చెప్పి ఆయన బయటికి వెళ్లిపోయారు. గురువారం రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News