ముంబయి, పుణెలో కొనసాగుతున్న సోదాలు
ముంబయి/న్యూఢిల్లీ: బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్, నటి తాప్సీ పన్ను, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూపు సిఇఓ శిభాశిష్ సర్కార్ నివాసాలు, కార్యాలయాలపై బుధవారం ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ముంబయి, పుణెలోని 30కి పైగా ప్రదేశాలలో సోదాలు కొనసాగుతున్నాయని ఐటి అధికారులు తెలిపారు. వీరితోపాటు టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్వాన్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ల కార్యాలయాలలో కూడా సోదాలు జరుగుతున్నయి. 2018లో మూతపడిన ఫాంటమ్ ఫిల్మ్‌పై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఈ సంస్థను అనురాగ్ కశ్యప్‌తోపాటు దర్శక నిర్మాత విక్రమాదిత్య మోత్వాని, నిర్మాత వికాస్ బెహల్, నిర్మాత-పంపిణీదారుడు మధు మంతెన కలసి స్థాపించారు. 2011లో స్థాపించిన ఫాంటమ్ ఫిల్మ్ లూటేరా, క్వీన్, అగ్లి, ఎన్‌హెచ్ 10, మసాన్, ఉడ్తా పంజాబ్ వంటి చిత్రాలను నిర్మించింది. కాగా, ఫాంటమ్ ఫిల్మ్ మూసివేత తర్వాత కశ్యప్ కొత్త కంపెనీ గుడ్ బ్యాడ్ ఫిల్మ్ స్థాపించారు. ఆందోళన్ ఫిల్మ్‌ను మోత్వాని స్థాపించారు. ఇక తాప్సీ పన్ను అనేక హిందీ, తమిళ, తెలుగు చిత్రాలలో నటించారు.
IT raids on Taapsee And Anurag Kashyap homes