Tuesday, November 5, 2024

ఎన్నికల దాడులు?

- Advertisement -
- Advertisement -

IT raids on the homes of DMK elders in Tamil Nadu

 

పాలక ప్రతిపక్షాల మధ్య వైరం, వైరుధ్యం ప్రజల సమస్యలకు సరియైన పరిష్కారం సాధించే జనహిత రాజకీయాలకే పరిమితం కావాలి గాని వ్యక్తిగత కక్ష సాధింపు, పరస్పరం బురద చల్లుడు స్థాయికి దిగజారకూడదు. కాని మన దేశంలో రాజకీయమంటే ప్రత్యర్థి వర్గాలు తప్పుడు పద్ధతుల్లో పరువు బజారుకీడుకుని పడదోసుకునే స్వార్థపూరితమైన మల్ల యుద్ధ క్రీడగా మారిపోయింది. అధికారంలోఉన్న వారు తమ చెప్పుచేతల్లోని దర్యాప్తు సంస్థలను సైతం ఇందుకు దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయమూ గట్టి పడిపోయింది. దీనిని ప్రజాస్వామ్యమనా లా, ప్రతీకార స్వామ్యమనాలా? అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతూ, పోలింగ్ అతి సమీపంలో ఉన్న తమిళనాడులో పాలక ఎఐఎడిఎంకె, బిజెపిల కూటమికి గట్టి సవాలుగా ఉన్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ అల్లుడు శబరీశన్, ఆయన సహచరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికార్లు శుక్రవారం నాడు జరిపిన దాడులు ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవు. గతంలో ఇటువంటి సున్నితమైన రాజకీయ సందర్భాల్లోనే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఐటి, ఇడి దాడులు, సోదాలు ఇప్పుడు గుర్తుకు రావడం సహజం.

ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణ ఆధారంగానే తమిళనాడులో డిఎంకె పెద్దల ఇళ్లపై ఈ దాడులు జరిపినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రకటించారు. ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి), సిబిఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) వంటివి కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక నేర పరిశోధక విభాగాలు. దేశ హితానికి విఘాతం కలిగించే తీవ్రమైన నేరాల దర్యాప్తు కోసం ఇవి ఆవిర్భవించాయి. కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని అనుభవిస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దల అదుపాజ్ఞలలో ముఖ్యంగా కేంద్ర హోం శాఖ కనుసన్నల్లో ప్రస్తుతం ఇవి పనిచేస్తున్నాయి. నియమాలు, విధి విధానాల ప్రకారమైతే ఇవి రాజకీయ జోక్యానికి అతీతంగా వ్యవహరించాలి. కాని అటువంటి నిష్పాక్షికతకు ఈ సంస్థలు దూరమై, బహు దూరమై కాలా కాలమైపోయింది. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిగజారుడు మరింత జోరందుకున్నదనే అభిప్రాయం నెలకొన్నది. ఎన్నికల్లో డబ్బు, మద్యం వగైరా ప్రలోభాల పంపిణీ సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో వీరువారు అనే తేడా లేకుండా ఏదో ఒక స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు ఈ మకిలి అంటి ఉంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో జరిగే పోలీసు తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు, మద్యం వంటివి పట్టుబడడం మామూలై పోయింది. ఆ తనిఖీలు కూడా పక్షపాత రహితంగా జరిగితే అందులో ఎవరు దొరికినా దొరకవచ్చు.

కాని కేంద్ర దర్యాప్తు సంస్థలు పని కట్టుకొని పోలింగ్‌కు ముందు కేంద్ర పాలక పక్షానికి సవాలుగా నిలిచిన పార్టీల ప్రముఖుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో దాడులు, సోదాలు ఎందుకు, దేనిని ఆశించి జరపవలసి వస్తున్నది? ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి ముందు ఒక వర్గానికి చెందిన నేతల ఇళ్లపై జరిగే ఈ దాడులు వారి తీర్పును ప్రభావితం చేయవా? కేంద్ర పాలకులకు రాజకీయంగా ఇరకాటమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ప్రత్యర్థులపై ఇటువంటి దాడులు జరగడం సర్వసాధారణమైపోయింది. గత ఏడాది కర్నాటక కాంగ్రెస్ మంత్రి శివకుమార్‌పై జరిగిన ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ దాడులు తెలిసినవే. అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రానికి చెందిన యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య సాగిన సిబిఐ దర్యాప్తు అది హత్యో, ఆత్మహత్యో దోషులెవరూ ఇంత వరకూ నిర్ధారించలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న సుదీర్ఘ రైతు ఉద్యమానికి మద్దతు అందిస్తున్న హర్యానాకు చెందిన ఇండిపెండెంట్ ఎంఎల్‌ఎ బల్‌రాజ్ కుంద్ పై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల పరమార్థమేమిటో దాచేస్తే దాగని సత్యమే. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డిదారిలో డబ్బు చేరవేత లాండరింగ్) నిరోధక చట్టం కింద ఇడి కేసులు విశేషంగా పెరిగిపోయాయి.

దాఖలైన కేసుల సంఖ్యతో పోల్చుకుంటే శిక్షలు పడినవి అత్యంత తక్కువగా ఉండడం గమనించవలసిన విషయం. గత నాలుగేళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా అపరిమిత స్థాయికి చేరుకున్నాయి. ఒక్క 2017 లోనే 1152 ఐటి దాడులు జరిగాయి. అయితే వాటిలో పటిష్ఠమైన సాక్షాధారాలు చూపించి కోర్టుల్లో శిక్షలు వేయించగలిగిన కేసుల సంఖ్య చాలా పరిమితంగా ఉండడం గమనించవలసిన విషయం. అంతేకాదు కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన కేసుల్లో ఈ సంస్థలు అప్పీలుకు వెళ్లిన సందర్భాలు కూడా బహు తక్కువని సమాచారం. 2019లో ఆదాయపు పన్ను శాఖ 570 కేసులు దాఖలు చేస్తే అందులో 105 సందర్భాల్లోనే శిక్షలు పడ్డాయి. ఇలా కేంద్ర పాలకుల రాజకీయ అవసరాల కోసం సాధనాలుగా ఈ సంస్థలు ఉపయోగపడడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎన్ని నిలువుల లోతున పాతిపెడుతుందోననే భయం రోజురోజుకీ పెరుగుతున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News