Monday, December 23, 2024

బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలను అడ్డుకోవాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి శ్రేణులకు పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రెండు డిఎన్‌ఏ ఒక్కటేనని, హిందూ వ్యతిరేకత వాటి విధానమని శుక్రవారం ఆపార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మజ్లిస్ ఆధిపత్యానికి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. ఈపార్టీలు ఎన్నికల తర్వాత ఒక్కటవడం ఖాయమన్నారు. కుటుంబ, రాచరిక పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉందన్నారు.

గత ఐదేళ్లుగా జాతీయ రాజకీయాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ నిర్వహించిన అన్ని సమావేశాలకు మద్దతు ఇచ్చి పాల్గొన్నది. ప్రజలు అరాచక, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు నిజాయితీతో కూడిన జనతా సర్కారును కోరుకుంటున్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని సర్వేలు స్పష్టం చేశాయని మన గెలుపును అడ్డుకునేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా బిజెపికి పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను మనం తిప్పికొట్టాలని ఈ రెండు పార్టీలకు సహజ మిత్రుడైన ఎంఐఎం వాటికి వంత పాడుతోందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన సిఎం కెసిఆర్ అధికారం చేపట్టిన తరువాత విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదన్నారు.

తెలంగాణ ఏర్పాటు జూన్ 2ను బిజెపి ఒత్తిడి మేరకు గత ఏడాది అధికారికంగా, మొక్కుబడిగా నిర్వహించినట్లు నటించారని ఈ విషయంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుండడంతో వేరే దారి లేక, గత్యంతరం లేక రాష్ట్రంలో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం బిజెపి కట్టుబడి ఉందని ప్రజలకు చెబుదాం మన ధన, మాన, ప్రాణాలను దోచుకున్న రజాకార్ల వారసత్వంగా పని చేస్తున్న మతతత్వ పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ మధ్య సయోధ్యకు నేతృత్వం వహిస్తున్నదన్నారు. రజాకార్లు మన ఆడబిడ్డలను చెరిచారని అడ్డుకున్న మన వాళ్లను దారుణంగా హింసించారు నిజాం పాలనలో నిర్బంధ మారణకాండ సాగిందన్నారు. గతంలో ఓవైసీ కూడా సరిగ్గా ఇదేవిధంగా 15 నిమిషాలు తనకు టైం ఇస్తే హిందువులందరినీ లేకుండా చేస్తానని భారతదేశానికి, హిందువులకు వ్యతిరేకంగా పిచ్చి కూతలు కూశాడు. ఇలాంటి వ్యక్తులు, శక్తులు, పార్టీల ఆలోచనకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి పోరాటం కొనసాగించాలన్నారు.
రానున్న ఎన్నికల్లో కుటుంబ పార్టీ, అవినీతి పార్టీలను తెలంగాణలో బిజెపిని విజయ పథాన నడిపించడానికి పూర్తి శక్తియుక్తులతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, డి.కె. అరుణ, బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి.మురళీధర్ రావుతో రాష్ట్రానికి చెందిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News