Wednesday, January 22, 2025

ధరలు ఇప్పట్లో తగ్గవా?

- Advertisement -
- Advertisement -

It will take two years for rate of inflation to come down

నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ 2022 ఆగస్టు 23న చెప్పారు. వృద్ధి రేటును పెద్దగా కోల్పోకుండానే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అంటే ఇప్పుడు పెరిగిన ధరల రేటు తగ్గేందుకు మరో రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పటమే. నిజానికిది జనాలతో ధరల చేదు మాత్రను మింగించేందుకు, ఆందోళన చెందుతున్న నరేంద్ర మోడీ సర్కార్‌కు ఊరట కలిగించేందుకు వెలిబుచ్చిన ఆశాభావం తప్ప పరిస్థితులు ఇప్పటి కంటే దిగజారితే ఏమిటన్నది ప్రశ్న. గవర్నరే చెప్పినట్లు ఇటీవలి గరిష్ఠం 7.8 శాతానికి చేరుతుందని కూడా ఎంతో ముందుగానే ఆర్‌బిఐ చెప్పి ఉంటే విశ్వసనీయత ఉండేది. మన్మోహన్ సింగ్ ఏలుబడిలో ఇంతకంటే తీవ్ర స్థాయికి చేరినపుడు కూడా అప్పటి గవర్నర్లు ఇలాంటి మాటలే చెప్పారు.

ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ ఎందుకు ఆందోళన చెందుతున్నది? ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, అందుకు ముందు గుజరాత్ సిఎంగా నరేంద్రమోడీ మహిమల మంత్రదండం గురించి మీడియా చెప్పిన కథలు, అన్నింటికి మించి మన్మోహన్ సింగ్ పాలన చివరి రోజుల్లో దిగజారిన పరిస్థితులు, అవినీతి అక్రమాల కారణంగా మోడీ అధికారానికి వస్తే తెల్లవారేసరికి అద్భుతాలు చేస్తారని నమ్మినవారికి ఎనిమిదేండ్లు గడిచినా రెచ్చిపోతున్న హిందూత్వ నూపుర్ శర్మలు, రాజాసింగ్‌లు తప్ప ఆర్ధికంగా జనానికి ఉపశమనం గురించి చెప్పాల్సిన వారు ఎక్కడా కనిపించటం లేదు. గత పదహారు నెలలుగా రెండంకెలకు పైగా నమోదవుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఐదు నెలల తరువాత జూలై నెలలో 13.93 కనిష్ట స్థాయికి తగ్గింది. గత సంవత్సరం 11.57 శాతం ఉంది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 43.75 స్థాయికి పెరిగింది.ద్రవ్యోల్బణం ఎందుకు సంభవిస్తుంది అన్నదాని మీద ఎవరి భాష్యం, కారణాలు వారివే. ప్రతికూల ప్రభావాలను జనం అనుభవిస్తున్నారు గనుక ఎవరు చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉందో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. ఆర్ధిక రంగంలో నగదు చెలామణి పెంపుదల కూడా దవ్యోల్బణానికి దారితీస్తుంది.

1951 నుంచి 2022 వరకు దేశంలో నగదు సరఫరా నెలవారీ సగటున రూ. 26,168.65 బిలియన్లు. 1952 అక్టోబరులో కనిష్ట రికార్డు రూ. 20.57 బిలియన్లు కాగా, 2022 జూలై గరిష్ఠ రికార్డు 2,09,109.47 బి. రూపాయలు. సరఫరా పెరిగితే దవ్యోల్బణం పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఆర్ధిక రంగంలో ద్రవ్య సరఫరాకు అనుగుణంగా ఉత్పత్తి, సేవలు, వస్తు సరఫరా లేకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్నది ఒక సూత్రీకరణ. ట్రేడింగ్ ఎకనమిక్స్ డాట్‌కావ్‌ు సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో పదివేల బిలియన్లు కాగా, 2010 నాటికి 50 వేలకు, 2015కు లక్ష, 2020కి 160వేలకు, 2022 జూలైలో 2,09,109.47 బి. రూపాయలకు చేరింది. ఉద్యోగుల వేతనాలుపెరిగితే ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. అసలు వేతన పెరుగుదల లేకున్నా ధరలు పెరుగుతాయని కొన్ని బుర్రలకు ఎక్కదు. 2020 21 మూడవ త్రైమాసిక ఆదాయంలో గృహ పొదుపు అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో పది నుంచి ఇరవై శాతం ఉంది. అదే మన దేశంలో 2.8 శాతం, ఇండోనేషియాలో రెండు శాతం తిరోగమనంలో ఉంది.

అలాంటపుడు రెండు చోట్లా ఒకే కారణంతో ద్రవ్యోల్బణం పెరగకూడదు. కరోనా కాలంలో కొన్ని నెలలు అసలు ప్రైవేటు రంగంలో ఉపాధి, వేతనాల్లేవు, అనేక చోట్ల వేతన కోతలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలో 70 శాతం కార్మికశక్తి గ్రామాల్లోనే ఉంది. 2020లో గ్రామీణ ప్రాంతా ల్లో వేతనాలు 3.5 శాతం తగ్గాయి, మరుసటి ఏడాది అరశాతం పెరగ్గా, 2021 22 తొలి తొమ్మిది నెలల్లో వ్యవసాయ పెరుగుదల 1.6 శాతం, గ్రామీణ ఇతర కార్మికుల వేతనాలు 1.2 శాతం తగ్గాయి. ఈ కాలంలో అసంఘటిత రంగ కార్మికులకు కనీసవేతనాలేమీ పెరగలేదు. కొన్ని రంగాల్లో కాస్త పెరిగినప్పటికీ మొత్తం మీద చూసినపుడు దేశంలో వేతనాలు పెద్దగా పెరగకున్నా ద్రవ్యోల్బణం పెరిగిందంటే దానికి వేరే కారణాలు దోహదం చేస్తున్నట్లే. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు గృహస్థుల కోసం కరోనా సందర్భంగా పెద్ద ఎత్తున చేపట్టిన ద్రవ్య ఉద్దీపన పథకాలు కారణంగా చెబుతున్నారు. మన దేశంలో పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం, కిలోపప్పులు, జనధన్ ఖాతాలున్న వారికి మూడు నెలలు ఐదేసి వందల నగదు, కొన్ని గాస్ బండలు తప్ప ఇచ్చిందేమీ లేదు. కరోనాతో నిమిత్తం లేని కిసాన్ నిధులు కూడా కలుపుకొని మొత్తం ప్యాకేజీ విలువ రూ.1.76 వేల కోట్లు మాత్రమే. మన దేశంలో కరోనా గృహస్థుల పొదుపు మొత్తాలను హరించటమే కాదు అప్పులపాలు చేసింది.

కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ల వల్ల ఖర్చు చేసేందుకు వీలులేక బలవంతపు పొదుపు పెరిగిందని చెబుతున్నారు. పరిస్థితి చక్కబడిన తరువాత కొనుగోళ్లకు పూనుకోవటంతో అలాంటి చోట్ల అధిక ద్రవ్యోల్బణం తలెత్తిందని ఐఎంఎఫ్ చెప్పింది. ధనికులుగా ఉన్నవారి కొనుగోళ్లు పెరిగినప్పటికీ మొత్తం మీద ఇది మన దేశానికి వర్తించదు. మాక్రోట్రెండ్స్ సంస్థ సమాచారం ప్రకారం కరోనాకు ముందు మన వినియోగదారుల 2018, 19 రెండు సంవత్సరాల వార్షిక సగటు ఖర్చు 1,664.28 బిలియన్ డాలర్లు కాగా, 2020,21 వార్షిక సగటు 1,751.73 బి.డాలర్లు అంటే 5.25 శాతం మాత్రమే పెరిగింది. ఇది ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు 5.85 శాతం కంటే తక్కువ, అంటే వాస్తవ ఖర్చు తగ్గింది. ఇదే అమెరికాను చూస్తే 2021 మే నుంచి 2022 మార్చి నెల మధ్య ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగా, 2022 మార్చి నెలలో అక్కడి వినియోగదారుల ఖర్చు 18 శాతం పెరిగింది. అంతకు రెండు సంవత్సరాల ముందు పన్నెండు శాతమే ఉండేది. 2019తో పోలిస్తే అమెరికన్ల వద్ద ఉన్న పొదుపు మొత్తం 2.8 లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. వారంతా ఆ మూటలను విప్పి కొనుగోళ్లకు పూనుకోవటంతో వస్తువులకు డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం పెరిగింది. మన దేశంలో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పట్టణాల్లో 16 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 16.6 శాతం అమ్మకాలు పడిపోయాయినా ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గటం లేదు? కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితి నుంచి ఆర్ధిక రంగాలను కాపాడుకొనేందుకు అనేక ధనిక దేశాలు పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించి జనానికి నగదు అందచేశాయి.

అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదలకు అదొక కారణమైతే, జనాలు ఆ సొమ్ముతో కొనుగోళ్లకు పూనుకోవటంతో సరకుల కొరత ఏర్పడటం, దిగుమతుల ధరలు పెరగటం వంటి కారణాలు దానికి ఆజ్యం పోశాయి. ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు అన్ని దేశాలూ ఒకే ప్రాతిపదికను అనుసరించటం లేదు. పరిగణనలోకి తీసుకొనే అంశాల ప్రాముఖ్యత దేశదేశానికీ మారుతుంది. మన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయకపోతే ఇబ్బందని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పటికే అర్ధమైంది. వాటిలో లబ్ధి పొందటంతో పాటు ధరల అదుపునకు ఇంధన ధరలను స్తంభింప చేశారు. ఎన్నికల తరువాత కూడా 2022 ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి అదే స్తంభన కొనసాగుతోంది. అదొక్కటే చాలదు కనుక కేంద్రం పెద్ద మొత్తంలో విధించిన సెస్‌ను కొంత తగ్గించారు. దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యాట్‌ను ఎందుకు తగ్గించవంటూ దాడి చేశారు. పెట్రోలు మీద లీటరుకు రూ. 8, డీజిలు మీద రూ. 6 తగ్గించి దీని వలన కేంద్ర ప్రభుత్వం ఏడాదికి లక్ష కోట్ల మేరకు ఆదాయాన్ని “త్యాగం” చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని పెంచినపుడేమో మిలిటరీ కోసమని జనానికి దేశభక్తి కబుర్లు చెప్పారు, తగ్గించినపుడు కేంద్ర ప్రభుత్వానికి దేశభక్తి తగ్గిందని అనుకోవాలా? ఈ తగ్గింపు ప్రక్రియను మరో విధంగా చెప్పాలంటే చమురుపై భారీగా పన్నుల పెంపుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నదని అంగీకరించటమే.

2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తక ముందే పెరుగుదల బాటలో ఉన్న ద్రవ్యోల్బణం తరువాత ఈ కారణంగా మరికొంత పెరిగింది. డాలరు నిల్వలను పెంచుకొనేందుకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులతో పాటు మన స్టాక్ మార్కెట్లో వాటాల కొనుగోలుకు విదేశీ సంస్థలను ప్రభుత్వం అనుమతించింది. ఇదే విధంగా విదేశాల నుంచి తక్కువ వడ్డీలకు దొరుకుతున్న డాలరు రుణాలను కూడా ప్రోత్సహించింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవటంలో ఘోర వైఫల్యం, అమెరికాలో వడ్డీ రేటు పెరుగుదల కారణంగా మన స్టాక్ మార్కెట్ నుంచి డాలరు పెట్టుబడులు వెనక్కు మరలాయి.ఇది కూడా ద్రవోల్బణం పెరుగుదలకు దారి తీశాయి. చమురు, ఇతర దిగుమతి వస్తువుల ధరల పెరుగుదలకు రూపాయి పతనం కూడా తోడైంది. దేశంలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు విదేశీ ధోరణులే కారణమని తప్పించుకొనేందుకు కొందరు ప్రభుత్వానికి వంతపాడుతున్నారు. మన దేశాన్ని నయా ఉదారవాద చట్రంలో బిగించినందున ఆ విధానాలను అనుసరిస్తున్న దేశాల జబ్బులన్నీ మనకూ కొంతమేర అంటుకుంటాయి.

జనాలకు చమురు, గ్యాస్, ఇతర సబ్సిడీలను ఎత్తివేసి, పరిమితం చేసి, కోతలు పెట్టటం, కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇవ్వటం, జనాల మీద పన్ను బాదుడు దానిలో భాగమే. పన్నుల పెంపుదల గురించి చట్ట సభల్లో చర్చకు తావులేకుండా జిఎస్‌టి మండలి, విద్యుత్ క్రమబద్ధీకరణ మండళ్ల ఏర్పాటు, ప్రభుత్వ అదుపులేని ప్రైవేటు రంగానికి అన్నింటినీ అప్పగించటమూ అదే. జిఎస్‌టి విధానం రాక ముందు ధనికులు వాడే విలాస వస్తువులపై 30 నుంచి 45 శాతం వరకు పన్నులు ఉండేవి. జిఎస్‌టి దాన్ని 28 శాతానికి తగ్గించింది. ఆ మేరకు తాజాగా పెంచిన పన్నులు, విస్తరించిన వస్తువుల జాబితాను చూస్తే సామాన్యుల నడ్డి విరవటమే కాదు ద్రవ్యోల్బణ పెరుగుదలకూ దోహదం చేస్తున్నది. వస్తూత్పత్తిదారులు తమ మీద పడిన భారాన్ని జనం మీదకే నెడతారన్నది తెలిసిందే. 202021లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా, అది 202122కు 79.18కి పెరిగింది.

2022 23లో రష్యా తక్కువ ధరలకు చమురు ఇచ్చినప్పటికీ ఆగస్టు 23వ తేదీ వరకు ఏప్రిల్ నుంచి ఐదు నెలల సగటు 106.13 డాలర్లకు చేరింది. దీన్ని బట్టి మన దిగుమతుల బిల్లు పెరుగుతుంది, దానికి రూపాయి విలువ పతనంతో మరింత భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు విదేశాల నుంచి వస్తువులనే కాదు ద్రవ్యోల్బణాన్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. దేశంలో బొగ్గు నిల్వలున్నా వాటిని తవ్వకుండా ఖరీదైన బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం విద్యుత్ సంస్థల మీద రుద్దం ద్రవ్యోల్బణ దిగుమతిలో భాగం కాదా? ఇలాంటి వాటి కారణంగానే వెంటనే ద్రవ్యోల్బణాన్ని తగ్గించే మంత్రదండం లేదని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారనుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News