ఇంగ్లండ్ ఆశలు ఆవిరి, రన్నరప్‌తోనే సరి
లండన్: ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఇటలీ ట్రోఫీని సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో 32 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి యూరోకప్‌కు సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఓ మెగా టోర్నమెంట్లో విజేతగా నిలువాలని భావించిన ఇంగ్లండ్ సాకర్ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. మరోవైపు ఇటలీ 1968 తర్వాత మరోసారి యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌గా నిలిచింది. లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇటు ఇంగ్లండ్, అటు ఇటలీ సర్వం ఒడ్డి పోరాడాయి. ఇరు జట్లు కూడా అసాధారణ పోరాట పటిమను కనబరచడంతో నిర్ణీత సమయంలో స్కోరు 11తో సమంగా ముగిసింది. దీంతో అదనపు సమయాన్ని కేటాయించారు.
ఎక్స్ట్రా టైమ్‌లో కూడా పోరు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్ల గోల్ కీపర్లు అద్భుత ప్రతిభను కనబరచడంతో అదనపు సమయంలో మరో గోల్ నమోదు కాలేదు. దీంతో ఫలితాన్ని తీర్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో పైచేయి సాధించి ఇటలీ యూడో కప్ విజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్లో ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్‌గా మలచింది. ఇంగ్లండ్ మాత్రం కేవలం రెండింటిని మాత్రమే గోల్‌గా మలచి ఓటమి పాలైంది. ఈసారి ఎలాగైనా యూరోకప్ను ముద్దాడాలని భావించిన ఇంగ్లండ్ రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు. మరోవైపు ఇటలీ మాత్రం చిరస్మరణీయ విజయంతో తన ఖాతాలో రెండో యూరోకప్ ట్రోఫీని జమ చేసుకుంది.
ఆరంభంలోనే గోల్ చేసినా..
మరోవైపు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్‌లోనే ఇంగ్లండ్ గోల్ చేసి ఇటలీకి షాక్ ఇచ్చింది. రెండో నిమిషంలోనే ఇంగ్లండ్ ఆటగాడు లూక్ షా గోల్ చేశాడు. యూరో కప్ ఫైనల్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఓ జట్టు గోల్‌ను నమోదు చేయడం ఇదే తొలిసారి. అయితే ఇంగ్లండ్ తొలి గోల్ సాధించినా ప్రథమార్ధంలో ఇటలీనే ఆధిపత్యం చేలాయించింది. ఇంగ్లండ్ గోల్ పోస్ట్‌పై పదేపదే దాడులు చేస్తూ స్కోరును సమం చేసేందుకు ఇటలీ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఇంగ్లండ్ 10 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా ఇటలీ దూకుడును ప్రదర్శించింది. ఇంగ్లండ్ గోల్ పోస్ట్‌పై వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరికి 67వ నిమిషంలో ఇటలీ ప్రయత్నం ఫలించింది. లియానార్డో బ్రోనుచి అద్భుత గోల్‌తో స్కోరును సమం చేసింది. తర్వాత ఇటు ఇంగ్లండ్ అటు ఇటలీ మరో గోల్ కోసం తీవ్రంగా శ్రమించినా పలితం లేకుండా పోయింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి రెండు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి.