ఇంటర్‌పోల్ సాయానికి ఒడిషా పోలీసు
ఐటిఆర్ సమాచారం లీక్‌పై కదలిక
నిందితుల విచారణతో పలు నిజాలు
భువనేశ్వర్ : రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ)లో వేగుచర్యల ఉదంతంలో ఓ రహస్య మహిళ పాత్ర ఇప్పుడు సంచలనం కల్గించింది. ఈ ఆగంతకురాలు ఎవరు? ఎక్కడుంది? వివరాలేమిటీ? అనే అంశాన్ని కనుగొనేందుకు ఒడిశా పోలీసులు ఇప్పుడు అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ సాయం తీసుకోనుంది. డిఆర్‌డిఒకు చెందిన ఛాందీపూర్ క్షిపణి పరీక్షల కేంద్రం (ఐటిఆర్) నుంచి అత్యంత కీలకమైన రక్షణ సమాచారం లీక్ అయింది. దీనిని ఈ మిస్టరీ మహిళ ఓ విదేశీ ఏజెంటుకు అందించింది. ఈ క్రమంలో ఐటిఆర్‌లో పనిచేసే ఐదుగురు ఉద్యోగులను రహస్య సమాచారం సేకరణకు డబ్బులు ఇచ్చి వారిని తన అనుచరులుగా మార్చుకుంది.వారి నుంచి రహస్యాలను విదేశాలకు తరలించింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని పూర్తిస్థాయిలో విచారించారు.
ఈ కేసుకు సంబంధించి కన్పించకుండా ఉన్న మహిళనే కీలకం అని, ఆమె గురించి గాలిస్తున్నామని ఒడిశా అదనపు డిజిపి (క్రైంబ్రాంచ్) సంజీవ్ పాండా తెలిపారు. మహిళ విదేశాలకు పారిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనితో ఆచూకీకి ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటున్నట్లు, సదరు మహిళ ఫోటో, ఆమె నిందితులతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులను సేకరించామని పాండా చెప్పారు. ఐటిఆర్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఫోన్‌ను ఈ మహిళ ట్యాప్ చేసిందని, దాదాపు 8 నెలల పాటు ఆయన కార్యకలాపాలు కదలికలను కనుగొంటూ వచ్చిందని, చాందీపూర్ ఐటిఆర్ సంబంధిత రక్షణ విషయాలను తాను ఎంచుకున్న ఏజెంట్లకు తరలించిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నిందితులకు ఎక్కువగా దుబాయ్ ఇతర పరదేశీ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు అందాయని, ఇవన్నీ కూడా ఈ అదృశ్య మహిళ కనుసన్నలలోనే జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.