హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సత్య, కంపెనీ, సర్కార్ తదితర చిత్రాలు తీసి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దేశంలో పౌరాణిక చిత్రాలు నిర్మించే ట్రెండ్ ఎలా ఉందని ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన కుండబద్దలుకొట్టినట్లు తన అభిప్రాయాలు తెలిపారు. ఎలాంటి తత్తరపాటు లేకుండా పౌరాణిక చిత్రాలు నేడు తీయడం ప్రమాదకరం అని నిక్కచ్చిగా తెలిపారు. ఇదివరకటి కాలంలో అయితే పౌరాణిక చిత్రాలు బాగానే ఆడాయి. కానీ ఇప్పుడు అవి తీసినా విజయం పొందడం కష్టం అన్నారు. దానికి బదులుగా ఎలాంటి మత వివాదాలు లేని వేరే రకం సినిమాలు తీయడం మంచిదన్నారు.
రణబీర్ కపూర్ తో ‘రామాయణ్’ సినిమా తీయడం లేక ఇతర పౌరాణిక చిత్రాలు తీయడం సరికాదన్నారు. ప్రస్తుతం మనదేశంలో పౌరాణిక చిత్రాలు తీయడం ప్రమాదకరమన్నారు. అవి సరిగా ఆడకపోవచ్చన్నారు. ‘‘మన పౌరాణిక కథలు ప్రజలకు బాగా తెలుసు. వారి భావాలకు విరుద్ధంగా సినిమా తీస్తే మాత్రం ప్రతికూల ప్రభావం పడగలదు. ఎందుకంటే పురాణ పురుషులను ఇక్కడి ప్రజలు భక్తిభావంతో కొలుస్తారు. అయినా ఈ రోజుల్లో సెన్సిటివ్ టాపిక్ తో సినిమాలు తీయడం దేనికి?’’ అని రామ్ గోపాల్ వర్మ నిలదీశారు.