హైదరాబాద్: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించకపోవడంపై ఎంపి అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. ఈ విషయంపై బుధవారం రాత్రి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో మాట్లాడానని చెప్పిన ఆయన.. ఐదు నుంచి 10 మంది ఎంపిలు ఉన్న పార్టీలనే సమావేశానికి ఆహ్వానిస్తున్నారని రిజిజు చెప్పినట్లు తెలిపారు. తక్కువ ఎంపిలు ఉన్న పార్టీలను ఎందుకు ఆహ్వానించరని అడిగితే.. అందరిని పిలిస్తే.. ఎక్కువ సమయం పడుతుందని.. అందుకే పిలవడం లేదని చెప్పినట్లు ఓవైసీ పేర్కొన్నారు.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఇది కేవలం బిజెపి లేదా ఇతర పార్టీల అంతర్గత సమావేశం కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే అఖిలపక్ష భేటీ. దీని ద్వారా మనం గట్టి సందేశం ఇవ్వాలి. అఖిలపక్షల సూచనలకు ప్రధాని ఓ గంట సమయం కేటాయించలేరా? మీ సొంతపార్టీకే మెజారిటీ లేదు. ఇది కేవలం రాజకీయ అంశం కాదు.. జాతీయ సమస్య. నిజమైన అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మోడీని కోరుతున్న పార్లమెంట్‌లో ఎంపిలు ఉన్న అన్ని పార్టీలను పిలవాలి’ అని ఓవైసీ అన్నారు.