ముంబై: ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ ఆలయం వద్ద తనకు గుడి ఉందని.. భక్తులు అందులో తనకి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకుంటారని నటి ఊర్వశీ రౌటెలా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాక.. దక్షిణాదిలో కూడా తనకు ఓ ఆలయం నిర్మించాలని ఆమె కోరింది. అయితే ఈ వ్యాఖ్యలపై బద్రినాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు మండిపడ్డారు.
బద్రినాథ్ సమీపంలో బామ్నిలో ఊర్వశీ పేరిట ఆలయం ఉన్న మాట వాస్తవమే అని.. కానీ, ఆ ఆలయానికి, నటికి ఎలాంటి సంబంధం లేదని అర్చకులు తేల్చేశారు. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం నుంచి పడిన ప్రదేశమే ఊర్వశీ దేవి ఆలయం అని.. నటి అది తన పేరుతో ఉన్న ఆలయం అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక.. ఊర్వశీ వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచమే అని బ్రహ్మకపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ పేర్కొన్నారు.