దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయింది. గిల్(2), రోహిత్(15), విరాట్(11) స్వల్ప స్కోర్‌లకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్, అక్సర్ పటేల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే శ్రేయస్ అర్థ శతకం సాధించడంతో పాటు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
తన కెరీర్‌లోనే అత్యధిక బంతుల్లో అర్థ శతకం సాధించాడు. శ్రేయస్. గతంలో 2022లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతను.. ఈ మ్యాచ్‌లో ఆ స్కోర్ సాధించేందుకు 75 బంతులు తీసుకున్నాడు. అయితే అర్థ శతకానికి చేరువలో ఉండగా.. రవీంద్ర బౌలింగ్‌లో అక్సర్ పటేల్(42) విలియమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్(74), కెఎల్ రాహుల్(14) ఉన్నారు.