అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన కుటుంబంతో కలిసి బుధవారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. భార్య ఉష, ముగ్గురు కొడుకులు ఎవాన్, వివేక్, కుమార్తె మిరాబెల్ కూడా జెడి వాన్స్ వెంట ఉన్నారు. ఈ కుటుంబం భారత్‌లో నాలుగు రోజుల పర్యటనకు విచ్చేశారు. “ తాజ్‌మహల్ అద్భుతం.నిజమైన ప్రేమకు వీలునామా. భారత దేశానికి మానవ చతురతతో కూడిన నివాళి. ” అని వాన్స్ తన విజిటర్ డైరీలో తాజ్ మహల్ సందర్శన తరువాత రాసుకొచ్చారు.బుధవారం రాజస్థాన్ లోని జైపూర్ నుంచి ఆగ్రా విమానాశ్రయానికి జేడీ వాన్స్ కుటుంబం చేరుకుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అధికారులు వారికి స్వాగతం పలికారు. “ గౌరవనీయులైన అమెరికా ఉపాధ్యక్షుడు .
జేడీ వాన్స్, వారి కుటుంబానికి కాలాతీతమైన భక్తికి, ఉత్సాహభరితమైన, ఆధ్యాత్మిక వారసత్వ సంప్రదాయ పవిత్రభూమి ఉత్తరప్రదేశ్ ఘనంగా స్వాగతం పలుకుతోంది ” అని యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆగ్రాలో తాజ్‌మహల్ సందర్శన తరువాత వాన్స్ కుటుంబం జైపూర్‌కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ నుంచి రామ్‌బాగ్ ప్యాలేస్ హోటల్‌కు చేరుకున్నారు. ఆగ్రాలో వాన్స్ కుటుంబీకులు విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ వరకు కారులో ప్రయాణించారు. వారిని కాన్వాయ్ అనుసరించింది. దారి పొడుగునా ప్రత్యేక అలంకరణలు ప్రదర్శించారు. వందలాది స్కూలు పిల్లలు వీధుల్లో బారులు తీరి అమెరికా పతాకంతోపాటు భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.