Monday, December 23, 2024

బిజెపికి ఏజెంట్‌గా సిబిఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిబిఐ, ఈడీ, ఐటి తదితర కేంద్ర సంస్థలన్నీ బిజెపికి ఏజెంట్‌గా పని చేస్తున్నాయని, వీరంతా రాజ్యాంగ పరిధిలో కాకుండా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఏది చెబితే అదే చేస్తూ వారి డైరెక్షన్‌లోనేపని చేస్తున్నారని ప్రజా సంఘాల జేఏసి ఛైర్మెన్ గజ్జల కాంతం ఆరోపించారు. అవినీతిపై పనిచేయాల్సిన సిబిఐ దురదృష్ణవశాత్తూ బిజెపి ఎజెంట్‌గా పని చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రాంతీయ, ప్రతిపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లోనే సిబిఐ దాడులు జరుగుతున్నాయని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ సంస్థలు ఎందుకు దాడులు చేయడం లేదని గజ్జల కాంతం ప్రశ్నించారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ బిసి సంఘాల జేఏసి ఛైర్మెన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్‌తో కలిసి ఆదివారం నాడు గజ్జల కాంతం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చుకుని దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తుండడాన్ని ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అలాగే రాష్ట్ర బిజెపి నాయకత్వం జీర్ణించుకోలేక పోతోందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా మారుస్తూ సిఎం కెసిఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు. దీంతో యావత్ దేశమంతా తెలంగాణను చూసి ఔరా అని ఆశ్చర్యపడుతోందన్నారు. ఇప్పటి వరకు దేశానికి ప్రధానులు అంతా ఉత్తర భారతీయులే అయ్యారని, దక్షిణ భారతదేశానికి చెందిన సిఎం కెసిఆర్ లాంటి వారు కూడా రావాలా వద్దా అని మోడీ, అమిత్ షాలకు సూటిగా ప్రశ్నించారు. మోడీ పాలన అంతా దోచుకో .. దాచుకో అనేదే నినాదం అన్నారు. సింగరేణి లాంటి సంస్థలను ఆదానీ.. అంబానీలకు కట్టబెట్టి వారి వద్ద నుండి 50 శాతం కమీషన్లు కొట్టేయాలని చూస్తున్నారన్ని ఆయన ఆరోపించారు.

ప్రజా సంపదను మొత్తం ఆదానీ.. అంబానీకే కేంద్రం దోచిపెడుతోందని మండిపడ్డారు. 2014లో ఆస్తులు.. 2022 నాటికి ఆదానీ.. అంబానీల ఆస్తులు ఎంత పెరిగాయో వారిపై సిబిఐ దాడులు చేయించరెందుకో అని నిలదీశారు. నిజానికి ఈ సంస్థలలో 50 శాతం వాటా కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షాదేనని ఆయన ఆరోపించారు. దేశానికి సంపదనను ఇస్తున్న సింగరేణి కాలరీస్ సంస్థని ప్రైవేటీకరించేందుకు ప్రధాని మోడీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మొన్నటికి మొన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ సింగరేణిపై చిలుక పలుకులు పలికి రాష్ట్ర వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నప్పుడు మేం ఎలా ప్రైవేటీకరిస్తామని అన్నారని, మరి మొన్న బెంగళూరులో ఆ ప్రయత్నాలు మీరు చేయించలేదా? అని నిలదీశారు. మోడీ, అమిత్ షాలు బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలపై విషం కక్కుతున్నారన్నారు.

దేశ సంపదను సిఎం కెసిఆర్.. ఎంఎల్‌సి కవిత దోచుకుందా.. బిజెపి నేతలు దోచుకున్నారా అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. దోచుకున్న వారిని వదిలేసి తెలంగాణ ప్రజలకు అనేక పథకాలను పెట్టి అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తోంటే.. మీరు కక్ష సాధింపుగా సీబీఐ, ఈడీ, ఐటి దాడులు చేస్తున్నారని గజ్జల కాంతం ఆరోపించారు. ఎంఎల్‌సి కవిత ఇంటిపై ఎసిబి దాడులను ప్రజా సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయన్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఆడ బిడ్డ అని.. గౌరవించాల్సింది పోయి ఆమెపై సిబిఐ విచారణ పేరుతో వేధించండం అంటే… సీత లాంటి ఆడబిడ్డపై దాడులు మీకు ధర్మమా అని అన్నారు. కవితపై సిబిఐ దాడుల నేపథ్యంలో ప్రజలంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నారన్నారు

. మోడీ.. అమిత్ షా కాచుకోండి.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సిబిఐ దాడులు కవితపైనే ఎందుకు.. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు మూడేళ్లలో రూ. 700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయే దమ్ముంటే విచారణ చేయించండి అని డిమాండ్ చేశారు. గ్రానైట్ వ్యాపారులను బెదిరించి బండి సంజయ్ డబ్బులు వసూలు చేసుకుని కోట్లాది డబ్బులు కూడ బెట్టుకున్నారన్నారు. తెలంగాణలోనే కాదు, బిజెపి పాలిత కర్నాటక, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా తదితర 19.. 20 రాష్ట్రాల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతుంటే సిబిఐకి కనిపించదా అని గజ్జల కాంతం అన్నారు. మధ్యప్రదేశ్‌లో అయితే ఏకంగా సిఎం, మంత్రులపైనే అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. ఒక్కో వ్యక్తి పేరున వేల కోట్ల ఆస్తులు ఉన్నా అక్కడ సిబిఐ దాడులు ఎందుకు చేయరని ప్రశ్నించారు. కేవలం తెలంగాణ రాష్ట్రంపై పడ్డారన్నారు.

సింగరేణి లాంటి 140 సంస్థలను ప్రైవేటీకరించారని, దీంతో లక్షలాది మంది కొలువులు పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు ఇచ్చి సిఎం కెసిఆర్ కొలువులు ఇస్తుంటే.. దేశంలో మాత్రం యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలే చేయడం లేదన్నారు. కెసిఆర్ లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక దాడులు చేస్తున్నారా? దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు లేకుండా చేశారని మండిపడ్డారు. బండి సంజయ్‌కి ప్రజల సమస్యలు తెలియడం లేదని, నటిస్తూ రూ. 700 కోట్లు వసూళ్లు చేశారన్నారు. పెట్టుబడి దారులంతా అమిత్ షా చేతిలో ఉన్నారని, ప్రభుత్వం మారి బిఆర్‌ఎస్ చేతికి రాగానే బండి సంజయ్ తీహారు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు.

కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీని పెట్టారని, 2024లో ఆయన ప్రధాని అవుతున్నారన్నారు. దక్షిణ భారతం నుంచి జాతీయ పార్టీ పెట్టిన మొదటి వ్యక్తి కెసిఆరే.. ఓరుగంటి వెంకటేశం గౌడ్ దక్షిణ భారతదేశం నుండి జాతీయ పార్టీ పెట్టిన మొదటి వ్యక్తి కెసిఆరేనని బిసి సంఘాల జేఏసి ఛైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు. అవినీతి సంపద ఆదానీ.. అంబానీలకు దోచిపెట్టిన తీరు, ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులను వేధించిన తీరు బయటపడుతుందని బిజెపి రాష్ట్రంలో ఈ వేధింపులకు పాల్పడుతోందన్నారు. ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్న తీరును కవితమ్మ లాంటి వారు నిలదీస్తారనే సిబిఐలను పంపిస్తున్నారన్నారు. నయానా భయానా సిబిఐ ఐటి ఈడీలతో భయపెట్టించి ఇతర పార్టీల నేతలను కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని ఓరుగంటి వెంకటేశం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News