Sunday, January 19, 2025

సాగు చట్టాలపై రైతు ఆందోళన: ట్విట్టర్‌పై భారత్ సర్కార్ ఒత్తిడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వంనుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సేసంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. డోర్సే చెబుతున్న విషయాలన్నీ పచ్చి అబద్ధాలని కేంద్ర సమాచార, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొట్టిపారేశారు. బహుశా ట్విట్టర్ చరిత్ర నుంచి చాలా సందేహాస్పద కాలాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ట్వీట్ చేశారు. సోమవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న డోర్సే భారత ప్రభుత్వంపై ఈ సంచలన ఆరోపణలు చేశారు.

ఏ ప్రభుత్వంనుంచైనా మీకు ఒత్తిళ్లు ఎదురయ్యాయా? అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డోర్సే భారత్‌ను ఉదహరించారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వంనుంచి తమకు చాలా అభ్యర్థనలు వచ్చేవని డోర్సేఆరోపించారు. ఒకానొక దశలో ట్విట్టర్‌ను భారత్‌లో మూసివేస్తామని కూడా కొందరు బెదిరించినట్లు ఆయన ఆరోపించడం గమనార్హం. అలాగే ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేస్తామన్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి బెదిరింపులు ఎవరినుంచి వచ్చాయనే దానిపై మాత్రం డోర్సే ఎలాంటి ఆధారాలను బైటపెట్టలేదు.

అయితే డోర్సే ఆరోపణలను మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. డోర్సే ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఆయన హయాంలో ట్విట్టర్ భారత చట్టాలను అనేకసార్లు ఉల్లంఘించిందని వెల్లడించారు. 2020 22 మధ్య పదేపదే నిబంధనలను అతిక్రమించారని తెలిపారు. 2022 జూన్ తర్వాత మాత్రమే ట్విట్టర్ భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రారంభించిందని తెలిపారు. డోర్సే ఆరోపించినట్లుగా ఎవరిపైనా తనిఖీలు నిర్వహించలేదని.. ట్విట్టర్‌ను మూసివేయనూ లేదని స్పష్టం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి డోర్సే హయాంలోని ట్విట్టర్ విముఖత వ్యక్తం చేసిందన్నారు. దేశీయంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలన్నీ ఇక్కడి చట్టాలను అనుసరించేలా చూసే హక్కు ఒక సార్వభౌమ దేశంగా భారత్‌కు ఉందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

2021జనవరిలో జరిగిన రైతుల ఆందోళనల సమయంలో అనేక దుష్ప్రచారాలు చక్కర్లు కొట్టాయని, వాటిలో నరమేధం లాంటి తీవ్రమైన అసత్య ప్రచారాలు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తిచెందకుండా భారత ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు. లేదంటే పరిస్థితులు మరింతగా దిగజారిపోయి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉండేవని వివరించారు. ఇలాంటి ఘటనలే అమెరికాలో జరిగినప్పుడు ట్విట్టర్ వెంటనే తప్పుడు సమాచారాన్ని తొలగించిందనిమంత్రి తెలిపారు. కానీ భారత్ విషయానికి వచ్చేసరికి మాత్రం వారికి ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. డోర్సే హయాంలో ట్విట్టర్ అనుసరించిన పక్షపాత వైఖరికి ఇది నిదర్శనమని తెలిపారు. ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లపై తనిఖీలు నిర్వహించలేదని, ఎవరినీ జైళ్లకు పంపలేదని మంత్రి స్పష్టం చేశారు.

భారత చట్టాలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడడంపైనే తమ దృష్టిని కేంద్రీకరించామన్నారు. డోర్సే హయాంలో ట్విట్టర్ భారత చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19లను సైతం విస్మరించిందనిరాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. అలాగే పక్షపాత వైఖరి అవలంబిస్తూ, అసత్య ప్రచారాలను తొలగించడానికి నిరాకరించిందని ఆరోపించారు. తద్వారా తప్పుడు సమాచారం ఆయుధాలుగా మారేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News