స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘బొమ్మరిల్లు భాస్కర్ జాక్ కథను చెప్పినప్పుడే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది చాలా పెద్ద కథ. పైకి కనిపించేది కాదు.. లోపల చాలా ఉంటుంది.
భాస్కర్ జానర్ మార్చడం వల్ల జాక్ చాలా కొత్తగా అనిపిస్తుంది. టిల్లు, టిల్లు స్క్వేర్ కారెక్టరైజేషన్ ఏ మీటర్‌లో ఉంటుందో.. జాక్ అంతకుమించి ఉంటుంది. టిల్లు అనేది క్యారెక్టరే బేస్డ్ సినిమా అయితే.. జాక్‌లో క్యారెక్టర్‌తో పాటు అదిరిపోయే కథ కూడా ఉంటుంది. ఈ సినిమా రొటీన్ యాక్షన్ సినిమాలా ఉండదు. చాలా రేసీగా ఉంటుంది. జాక్ అనేది నిజంగానే క్రాక్ లాంటి పాత్ర. చాలా ట్విస్టులు ఉంటాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. ‘సిద్దు లాంటి నటుడితో పనిచేయడం ఏ దర్శకుడికైనా చాలా సులభం. సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు. ఆ సీన్ అద్భుతంగా వస్తుంది. జాక్ పాత్ర అద్భుతంగా ఉంటుంది.
ప్రతీ ఒక్కరిలోనూ జాక్ ఉంటాడు. ఆ జాక్ ఎవరు? అనేది ఎవరిది వాళ్లే తెలుసుకోవాలి. ఈ సినిమా నా స్టైల్లోనే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ను నమ్మి వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను నేను నిరాశ పర్చను. పైన సిద్దు ఫ్లేవర్ కనిపించినా లోలోపల నా స్టైల్లో ఉండే ఎమోషన్, మెసెజ్ అన్నీ ఉంటాయి. వైష్ణవి చైతన్య కళ్లతోనే నటించేశారు. ఆమె చాలా గొప్ప స్థాయికి వెళ్తారు’ అని తెలిపారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు హీరోగా జాక్ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య పాల్గొన్నారు.