ఉత్తమ రచనలను పురస్కారాలతో గౌరవించుకోవడం పౌరసమాజంలో సత్సంప్రదాయం. ఇలా ఎంపికైన గ్రంథానికి, దాని రచయితకి విశిష్ట స్థానం, ప్రచారం లభించి ఆ రచయితకే కాకుండా సమస్త సాహితి లోకానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విధానానికి పతాకస్థాయిగా మన దేశంలో భారతీయులు రాసిన ఇంగ్లీషు నవలకు జెసిబి లిటరరీ ఫౌండేషన్ అక్షరాలా ఇరువైఐదు లక్షల రూపాయల బహుమతిని ప్రకటిస్తోంది. ప్రస్తుతానికి రచనకిచ్చే అత్యంత భారీ నగదు పురస్కారం ఇదే అనుకోవాలి.
ఎంపిక కోసం నవల సరాసరి ఇంగ్లీషులో రాయకున్నా మరో భాషలో రాసి ఇంగ్లీషులోకి అనువాదమైనదైనా అర్హమైనదే. ఇలా అనువాద పుస్తకం ఎంపికైతే రచయితకు రూ.25 లక్షలతో పాటు అనువాదకుడికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. 2018 నుండి ఆరంభించిన ఈ నగదు పురస్కార ప్రదాన గౌరవం 2021 సంవత్సరానికి మలయాళీ రచయిత మణియంబాత్ ముకుందన్ రాసిన ఢిల్లీ కథాగల్ కు లభించింది. 2011 లో ఆయన మలయాళంలో రాసిన ఈ నవలను ఈ సంవత్సరం ఫాతిమా మరియు నందకుమార్ కలిసి ఇంగ్లీషులోకి ’ఢిల్లీ : ఏ సోలిలక్వి’ అనే పేరిట అనువదించారు.
సమకాలీన భారతీయ సాహిత్యం ప్రపంచానికి తెలియజేయాలనే గొప్ప లక్ష్యంతో గత నాలుగేళ్లుగా ఈ అవార్డు ఇస్తున్న జెసిబి లిటరరీ ఫౌండేషన్ స్థాపకులు అందరికి తెలిసిన జెసిబి అనే భారీ బరువులు ఎత్తే యంత్ర సామాగ్రి ఉత్పత్తిదారులే. ఇప్పటివరకు ఈ పురస్కారం మూడు సార్లు మలయాళీ రచయితలే అందుకున్నారు. 2018 లో తొలి పురస్కారం బెంజుమన్ రాసిన జాస్మిన్ డేస్ కి లభించింది. ఆయన 2014 లో రాసిన ’ముల్లప్పు నిరముల్లా పాకలుకల్’ అనే మలయాళీ నవలను 2018లో షెహనాజ్ హబీబ్ ఇంగ్లీషులోకి అనువదించారు. 2019లో ఈ అవార్డును ఇంగ్లీషులోనే మాధురి విజయ్ రాసిన ’ది ఫార్ ఫారెస్ట్’ కు ఇచ్చారు. 2020 లో మలయాళీ రచయిత ఎస్ హరీష్ రాసిన మీసా అనే నవలకు లభించింది. దీని ’ముస్టాచ్’ గా జయశ్రీ కాలత్తిల్ ఇంగ్లీషులోకి తెచ్చారు.
ఈ అవార్డు ఇచ్చేందుకు ముందు సంవత్సరం ప్రచురింపబడిన నవలలను మార్చి 1 నుండి ఏప్రిల్ 30 వ తేదీ దాకా ఎంట్రీలుగా స్వీకరిస్తారు. పోటీకి వచ్చిన వాటిలోంచి పదింటిని సెప్టెంబర్ 6 న, మళ్ళీ వాటిలో మెరుగైన ఐదింటిని 4 అక్టోబర్ నాడు ప్రకటిస్తారు. చివరగా ఉత్తమ నవలను పురస్కార ప్రధానం రోజైన 13 నవంబర్ నాడు బయటపెడతారు. తుది జాబితాలోని ఐదింటికి కూడా ఒక్కో నవలకు లక్ష రూపాయల నగదు బహుమతి, రచన ఆంగ్లేతర భాషదైతే అనువాదకులు యాభై వేలు ఇస్తారు.
ఈ యేటి పురస్కార గ్రహీత ముకుందన్ మలయాళంలో పేరున్న సీనియర్ రచయిత. పాండిచ్చేరి సమీపంలోని మాహె అనే పట్టణం లో 1942 లో పుట్టిన ఆయన 1961 లో తన తొలి కథను, 1969 మొదటి నవలను రాశారు. ఇప్పటివరకు 12 నవలలు, 10 కథా సంకలనాలు వెలువరించారు. వీరి కథలు భారతీయ ఇతర భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచిలోకి కూడా అనువదించబడ్డాయి. మాహె అనే నది ఒడ్డున గల ఈ పట్టణం కేరళకు చెందిన కన్నూర్ మరియు కోజికోడ్ జిల్లాల నడుమ ఉంటుంది. 1974 ఆయన రాసిన మయాజిప్పెహయ్యేదే తీరంగాలల్ అనే నవల మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ, 2006 లో క్రాస్ వరల్ బుక్ అవార్డ్, కేరళ ప్రభుత్వపు ఇజుతచన్ పురస్కారం ఆయనకు లభించాయి. ముకుందన్ పుట్టింది పాండిచ్చేరిలో అయి నా తన 40ఏళ్ల జీవితం ఢిల్లీలో గడిచింది. ఢిల్లీలో ఆయన ఫ్రెంచి ఎంబసీలో సాంస్కృతిక సంబంధాల అధికారిగా పనిచేశారు. ఢిల్లీపై ఆయన మూడు నవలలు రాశారు. పదవి విరమణ అనంతరం ముకుందన్ తన విశ్రాంత జీవితాన్ని మహెలో గడుపుతున్నారు. మాహె నది తీరం ఆయనకు ఇష్టమైన ప్రదేశం. దాని నేపథ్యం ఆయన రచనల్లో కనిపిస్తుంది.
ఢిల్లీలోని సామాన్యుల జీవన వెతలపై ముకుందన్ ఎన్నో కథలు రాశారు. ఢిల్లీ కథాగల్ నవల ఇతివృత్తం కూడా ఢిల్లీ నేపథ్యలోంచి తీసుకున్నదే. విషయ సేకరణ కోసం నాలుగేళ్లపాటు ఢిల్లీ మురికివాడల్లో తిరుగుతూ పేదల జీవితాల్ని పరిశీలించారు. పాత ఢిల్లీలోని గోవిందపురి అనే ప్రాంతంలో పేదల ఇళ్లలో ఉంటూ కొంతకాలం గడిపారు. ఊహకైనా అందని దుర్భర దారిద్య్రన్ని చూసి చలించిపోయారు. ఈ పుస్తకంలో ఉన్నదంతా చూసిన అనుభవంలోంచి రాసినదే. కథాకాలం 1959 నుండి నలుపై ఏళ్ల చరిత్ర. కేరళ నుండి బతుకు తెరువు కోసం ఢిల్లీకి వచ్చిన సహదేవన్ అనే 20 ఏళ్ల యువకుడు పడిన సుదీర్ఘ కష్టాలు, బాధల సమాహారమిది. వీటికి సమాంతరంగా ఆ మహానగరంలో అంతులేని ఆర్థిక అసమానతలు,పేదరికం, ఆకలి, మత కుల వివక్ష వైషమ్యాలు అణచివేతలు మరో వలయంగా చుట్టుముడతాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆ రోజుల్లో మారిన రాజకీయ పరిణామాలు, సామాన్యులపై వాటి ప్రభావం చారిత్రక ప్రాధాన్యత గల రచనగా ఇందులో చూడొచ్చు. ఇండో చైనా యుద్ధం, పాకిస్తాన్ తో యుద్దాలు, దేశంలో అత్యయిక పరిస్థితి, ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోతల నేపథ్యంలో ఢిల్లీలోని సామాన్యుని జీవనం ఎలా సాగిందో రచయిత ఇందులో చూపారు. మురికి కాలువల్లో సిక్కుల పగిడీలు, చెప్పులు కుప్పలు తెప్పలుగా కొట్టుకుపోతూ కనబడే దృశ్యాలు చదువరులను కదిలిస్తాయి.
ఇరువై ఏళ్ల పుట్టినూరి జీవితం, నలభై ఏళ్ల ఢిల్లీ ఉద్యోగ జీవితం సమన్వయం అయి కాక అవి ముకుందన్ ని వెంటాడి వేటాడి రచనలు చేయించాయి. నవలలోని మహదేవన్ పాత్రలో తాను కూడా ఉన్నాడు. ఎంత అధికారి అయినా, సుదీర్ఘ కాలం ఢిల్లీలో ఉన్నా నగరంలో పరాయివాడుగా మాహె సొంత బిడ్డగా అనుభూతికి లోనయ్యారు. ఈ భావనలే ఆయన్ని విలక్షణమైన రచయితగా తీర్చిదిద్దాయి.
జెసిబి లిటరరీ ఫౌండేషన్ సరాసరి ఇంగ్లీషు నవలలకే కాకుండా అనువాదాలకు కూడా పురస్కారం ఈయడం భారతీయ భాషల రచయితలకు గొప్ప అవకాశంగా భావించాలి. రచన కాలం ఎప్పడిదైనా అనువాద ప్రక్రియ ఎంపిక కాల వ్యవధిలో జరిగినా పోటీకి స్వీకరించడం మరో సదుపాయం దొరికినట్లే. వెంటనే రాయవలసిన అవసరం లేకుండా ఎప్పుడో రాసిన నవలని ఇప్పుడు అనువాదం చేయించి కూడా పోటీకి పంపవచ్చు.
ఇంతవరకు జరిగిన నాలుగు పోటీల్లో తొలి ఎంపికలోని నాలుగు పదుల్లో కూడా తెలుగుతో సహా చాలా ప్రాంతీయ భాషల రచనలు కనబడలేదు. ప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రెండు సార్లు రెండో దశ దాక వచ్చి నిలిచారు. ఇంతవరకు ఎంపికైన రచనలన్నీ దిగువ బతుకుల కోణం నుంచే సాగాయి. నాటకంలో ఒక పాత్ర కోసం నిమ్న కులస్తుడు పెంచుకున్న మీసం అగ్రకుల ఆగ్రహానికి కారణం కావడం ’ది ముస్టాచ్’ కథాంశం. జాస్మిన్ డేస్ కూడా ఒక పాకిస్తానీ యువతి దుబాయిలో రేడియో జాకీగా ఎదుర్కొన్న ఇబ్బందుల కథనమే. ప్రతి యేడు న్యాయనిర్ణేతలు మారుస్తూ ఎంపికను చాలా కట్టుదిట్టంగా కొనసాగిస్తున్న జెసిబి లిటరరీ ఫౌండేషన్ కలకాలం ఉండాలని, మరిన్ని పురస్కారాలకు ముందుకు రావాలని కోరుకుందాం.
బి. నర్సన్
9440128169