ఛార్జిషీట్లో నటి పేరును చేర్చిన ఈడీ
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ఉచ్చు బిగిస్తోంది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీటులో ఆమె పేరును చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్టు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ దారని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగులు, జిప్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్లెట్, మినీ కూపర్, ఇలా దాదాపు రూ. 10 కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్, ఆమె కుటుంబ సభ్యులకు సుకేశ్ ఇచ్చినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.
సుకేశ్‌తో నటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ విచారణలో తేలింది. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ పలుమార్లు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఆ మధ్య జాక్వెలిన్ విదేశాలకు వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దీనిపై ఆమె కోర్టుకు వెళ్లగా విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. మరోవైపు కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జాక్వెలిన్‌కు చెందిన రూ. 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసుకున్నారు. ఇందులో రూ. 7 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లే ఉన్నాయి. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి, వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ. 200 కోట్లు సుకేశ్ చంద్రశేఖర్ వసూలు చేశాడు. తర్వాత బెయిల్ విషయాన్ని దాట వేస్తుండటంతో శిబిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 2021లో సుకేశ్‌ను అరెస్టు చేశారు. అయితే జైల్లో నుంచి కూడా సుకేశ్ తన నేరాలను కొనసాగించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. అతడిని కలిసేందుకు పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీలు జైలుకు వచ్చినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.