Tuesday, November 5, 2024

కిషన్ రెడ్డీ…. దానిపై చర్చకు సిద్ధమా?: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadeesh reddy comments on AP govt

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసే యాత్ర చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్‌పై కిషన్ రెడ్డి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, గాలి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి ప్రజలకు నిజాలు చెబితే సంతోషించేవాళ్లమన్నారు. 2014లో మోడీ మొదటి సారి ప్రధాని అయినప్పుడు రూ.60, రూ.50 ఉన్న పెట్రోల్, డిజీల్ రేట్లు ఇప్పుడు ఎలా వంద రూపాయలు దాటిందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని మోడీ మోసం చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్నదేంటి… రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదేంటి? అని కిషన్ రెడ్డిని నిలదీశారు. రెండు వేల రూపాయల ఆసరా పింఛన్ దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

నిధులు కేంద్రం ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తోందని, రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులే తిరిగి ఇస్తోందన్నారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేంద్రానికి మాటలు తప్పితే చేతలు లేవని, స్కిల్ ఇండియా అని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలకు అబద్దాలు మాట్లాడడంతో స్కిల్స్ నేర్పించారని మండిపడ్డారు. అబద్దాలాడడం బిజెపి వాళ్లకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పి సిఎం కెసిఆర్‌పై ప్రజల్లో ఉన్న ప్రేమను పోగొట్టలేరన్నారు. నల్లధనం తెస్తామన్న బిజెపి హామీ ఏమైందని కిషన్ రెడ్డిని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి గాలి మాటలు మానుకోవాలని హితువు పలికారు. ఐదు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా మోడీ ప్రభుత్వం నిధులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బిజెపి మేనిఫెస్టో, టిఆర్‌ఎస్ మేనిఫెస్టో అమలుపై చర్చకు కిషన్ రెడ్డి సిద్ధమా? అని జగదీష్ రెడ్డి సవాలు విసిరారు. రైతు చట్టాలతో అన్నదాతల నడి విరుస్తున్నారని, నిత్యవసరాల ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారని విరుచుకపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News