సూర్యాపేట: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త, మాజీ బాస్ ల ఫైల్స్ ఓపెన్ కు రేవంత్ రెడీగా ఉన్నారా? మంత్రి జగదీష్ రెడ్డి సవాలు విసిరారు. 1995 నుండి 2004 వరకు ,2004 నుండి 2014 వరకు ఫైల్స్ పై చర్చ జరగాల్సిందేనన్నారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటా.. బిఆర్ఎస్ మూడు పంటలకు కరెంటా? అన్న దానిపై చర్చ జరగాలన్నారు. పవర్ హాలిడేలు ప్రకటించి సంక్షోభం సృష్టించిన ఘనత కాంగ్రెస్ దేనని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొరికి పోయిన దొంగ అని విమర్శించారు.
ఎఐసిసితో బుకాయింపు చర్యలు మానుకోవాలని, అబద్దాన్ని దాచి పెట్టేందుకే 100 అబద్దాలు ఆడుతున్నారని, దొంగ డ్రామాలతో రైతాంగాన్ని మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, 2014కు ముందు సాగు నీరు కాదు కదా త్రాగు నీరు అందించ లేక పోయారని జగదీష్ రెడ్డి చురకలంటించారు. కాంగ్రెస్ దుర్మార్గాలకు నల్లగొండ జిల్లా నాశనమైందని, ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ పార్టీదేనని, ఎడమ కాలువ కింద రెండు పంటలకు ఏనాడైనా నీళ్లు ఇచ్చారా? అని అడిగారు.
Also Read: దేశానికి బలం రైతులే: రాహుల్ గాందీ
తెలంగాణా రైతాంగం చైతన్యవంతులు అని, వారి ముందు కాంగ్రెస్ జిమ్మిక్కులు ఫలించవన్నారు. కాంగ్రెస్ కుట్రలపై రైతాంగంలో చర్చ జరగాలని, రైతు వేదికలు, రచ్చబండలు అందుకు వేదికలు కావాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎఐసిసిసి విధానమే టిపిసిసి పాటిస్తుందని, ఎఐసిసి దిగివచ్చిన రైతుల నుండి కాంగ్రెస్ తప్పించుకోలేదన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అవగాహన లేకనే అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఏ రూట్ లో వచ్చినా కాంగ్రెస్ నాయకులకు సమాధానం చెప్పేందుకు రైతాంగం రెడీగా ఉందన్నారు. మూడు గంటల కరెంట్ ఆన్న కాంగ్రెస్ ను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు.
మూడు పంటలకై ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట నడవాలని కోరారు.