హైదరాబాద్: ఇప్పటివరకు తనని సస్పెండ్ చేస్తూ బులెటిన్ ఎందుకు ఇవ్వలేదని ఎంఎల్‌ఎ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీకి రావొద్దు అనడానికి ఎలాంటి పరిమితి ఉందని, తనని సస్పెండ్ చేసినట్లు బులెటిన్ ఇస్తే తాను రాను అని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏ కారణంతో నన్ను సస్పెండ్ చేశారని, వారం నుంచి ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదన్నారు. అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, పద్దతి ప్రకారం నడవట్లేదని, రాజ్యాంగం విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తోందని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు.
సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవని, ఇప్పటికే సభాపతిని రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశానని, ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్టలా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. సస్పెన్షన్ బులెటిన్ ఇవ్వాలని, లేకుంటే సభాపతిని కలుస్తానని వివరించారు. తాను కోర్టుకు పోతానన్న భయంతో బులెటిన్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. మంత్రలు జవాబివ్వలేకపోవడంతోనే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారని జగదీశ్ రెడ్డి చురకలంటించారు. దావత్‌లకు కూడా మంత్రులు ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారని, నిన్న జానారెడ్డి ఇంట్లో జరిగిన దావత్‌కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెలికాప్టర్లలో వెళ్లారని తెలిపారు.