హైదరాబాద్: కృష్ణా నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నీళ్లను ఎపి నాయకులు తీసుకెళ్తున్న రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాటాకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణకు సాగు, తాగు నీరుకు ఇబ్బంది వచ్చే పరిస్థితి దాపురించిందని, తెలంగాణకు ఇంకా 140 టిఎంసిల నీళ్లు రావాల్సిందన్నారు. నీళ్ల దోపిడీపై కెఆర్‌ఎంబి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణకు బిజెపి, కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా కోరుతూ ఎపి లేఖ రాసింది. అత్యవసర మీటింగ్ నేపథ్యంలో సోమవారానికి వాయిదా వేయాలన్న ఎపి అధికారులు కోరారు. సమావేశం వాయిదాపై కెఆర్‌ఎంబి ఏ నిర్ణయం తీసుకోలేదు. తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. తెలంగాణ అధికారులు మ.3:30కి కెఆర్‌ఎంబి సమావేశానికి హాజరుకావడంతో పాటు తాగు, సాగునీటి అవసరాలను వివరించనున్నారు.