హైదరాబాద్: ఎపి సిఎం జగన్ తండ్రిని మించిన దుర్మార్గుడు అని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోడీకి ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను సృష్టించడమే ఎపి ప్రభుత్వ పని అని విరుచుకపడ్డారు. ఎపి నాయకులకు హైదరాబాద్ అవసరాలు పట్టవా? అని ప్రశ్నించారు. సర్వే పేరిట ఎపి ప్రభుత్వం నిర్మాణాలు కొనసాగిస్తుంది నిజం కాదా? అని నిలదీశారు. ఎపి ప్రభుత్వం జివొల పేరిట చిలక పలుకులు పలుకుతోందన్నారు. మద్రాస్‌కు మంచినీటి పేరుతో కృష్ణా నీళ్లను దోచుకున్నారన్నారు.
సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏళ్లు ద్రోహం చేశారని, ఆడుకుంటా, వాడుకుంటాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదని, సిఎం కెసిఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరని జగదీష్ ఘాటుగా విమర్శించారు. చట్టపరంగానే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని, శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ ఉత్పత్తి కోసమని, రెండు తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి ఫార్ములా ముందుకు తెచ్చింది సిఎం కెసిఆరేనని, ఎపి సిఎం ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో ముందుకు పోతున్నారని, తప్పులు చేసినోళ్లే లేఖల పేరుతో పరిహాసం ఆడటం మంచిది కాదని సూచించారు.