సూర్యాపేట జిల్లా కేంద్రంలో రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి…..
సూర్యాపేట: ప్రజలు చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఆహార భద్రత రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభించామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు రేషన్ కార్డ్స్ అందజేసి లాంఛనంగా జగదీష్ రెడ్డి ప్రారంభించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆకలిని పారద్రోలి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కిందన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ళు అలుపెరుగని ఉద్యమం చేసి, సాధించిన తెలంగాణలో సుపరిపాలన చేస్తున్న అరుదైన ఘనతను సిఎం కెసిఆర్ సొంతం చేసుకున్నారని పొగిడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా రంజక పాలనలో తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలు ఆత్మవిశ్వాసం, భరోసాతో జీవిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అర్హులైన 27 వేల మంది లబ్ధిదారులకు రేషన్ కార్డ్ లను పంపిణీ చేస్తున్నామని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..