Sunday, December 22, 2024

అసెంబ్లీ సాక్షిగా సిఎం అబద్దాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు,అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని, ఇపుడు అదే అబద్దాలతో పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి అనే పేరు అబద్దానికి పర్యాయ పదంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మెడపైన కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లను పెట్టమన్నా కెసిఆర్ ఒప్పుకోలేదని,కానీ 2017లోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి కెసిఆర్ ఒప్పుకున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పి సభను ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. సిఎం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ మంత్రి మహమూద్ అలీ, బిఆర్‌ఎస్ నేతలు తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, బాల్క సుమన్, కె .వాసుదేవ రెడ్డిలతో కలిసి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సభలో రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్ధం అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చదివింది ఉదయ్ పధకానికి చెందిన పేపర్ అని, దానిలో ఉన్న విషయాన్ని పూర్తిగా చదవకుండా.. కొద్ది భాగాన్ని మాత్రమే సభలో చెప్పారని ఆరోపించారు.

మీడియాలో తప్పుడు వార్తలు రాసేలా పతాక శీర్షికల్లో వచ్చేలా సిఎం రేవంత్ కుట్ర పన్నారని విమర్శించారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం తమకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తాము మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని గుర్తు చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు వాళ్లకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కుట్రలను గమనించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రైతుల దగ్గర స్మార్ట్ మీటర్లు ఉన్నాయో రేవంత్ రెడ్డి చెప్పాలని అడిగారు. రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్కులు ప్లే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు నిధులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ చెప్పారని గుర్తు చేశారు.

నగరంలో ప్రతి ఇంటికి మీటర్లు పెట్టాం
ఉదయ్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకువచ్చిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఉదయ్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో కరెంటు బిల్లులు కట్టడం లేదని పేపర్లలో తప్పుడు రాతలు రాయించారని, హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి మీటర్లు పెట్టామని చెప్పారు. విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోందా..? అని ప్రశ్నించారు. దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకుంటున్నట్టు ఉందని విమర్శించారు. ఈ స్మార్ట్ మీటర్ల ప్రస్తావన ఇపుడు తీసుకురావడంలో దుర్మార్గం ఉందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ పదేళ్లు తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, రేవంత్ రెడ్డి లాంటి నీచమైన సిఎం దేశంలో మరెవ్వరూ లేరని అన్నారు. రేవంత్ అసెంబ్లీలో మందబలంతో ఏమార్చగలడేమో గానీ ప్రజల నుంచి తప్పించుకోలేరని అన్నారు. కేంద్రం రాష్ట్రాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరూ దాచిపెట్టలేరని చెప్పారు. అసెంబ్లీలో తప్పించుకున్నావ్ ..బహిరంగ చర్చకు వస్తావా రేవంత్ అంటూ జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News